Revanth Reddy launches 4 schemes: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేసారి 4 సంక్షేమ పథకాలు ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాలను రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవాళ కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ఈ పథకాలను ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే ఇదే వేదికపై పలు పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులకు గత ప్రభుత్వం ఎకరాకు 10 వేలు మాత్రమే ఆర్థిక సాయం చేసిందన్నారు. కానీ ఇప్పుడు ఖర్చులు అధికమయ్యాయి. వ్యవసాయంలో ఖర్చులు పెరిగాయి. అందుకే ఇకపై ఎకరాకు 12 వేలు చొప్పున రైతు భరోసా సాయం అందిస్తున్నామని అన్నారు. ఇవాళ రాత్రి నుండే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకంపై క్లారిటీ ఇచ్చారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించిన పథకాల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి. ఇవాళ బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ అర్థరాత్రి 12 గంటలు దాటిన తరువాతి నుండి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం డబ్బులు జమ అవడం ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు.