Hyderabad: ఐఎండీ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు మెయిల్
Bomb Threat: నగరంలోని బేగంపేటలో ఉన్న భారత వాతావరణ శాఖ (IMD) కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది.
Hyderabad: ఐఎండీ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు మెయిల్
Bomb Threat: నగరంలోని బేగంపేటలో ఉన్న భారత వాతావరణ శాఖ (IMD) కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఒక మెయిల్ అధికారులను, ఉద్యోగులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
బేగంపేటలోని వాతావరణ కేంద్రం ఆవరణలో 14 ఆర్డీఎక్స్ (RDX) బాంబులను అమర్చినట్లు కార్యాలయ అధికారిక మెయిల్ ఐడీకి సందేశం వచ్చింది. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఉద్యోగులందరినీ కార్యాలయం నుండి బయటకు పంపించి, గంటల తరబడి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
కార్యాలయం మొత్తాన్ని జల్లెడ పట్టిన అనంతరం ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇది కేవలం భయబ్రాంతులకు గురిచేయడానికి పంపిన 'ఫేక్ మెయిల్' (Hoax) అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు పంపారు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వరుస బెదిరింపులతో ఆందోళన
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా ఇటువంటి బాంబు బెదిరింపులు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఏపీ హైకోర్టుతో పాటు రాజమండ్రి, నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ కోర్టులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ సహా పలు నగరాల్లోని పాఠశాలలకు కూడా తరచుగా ఇటువంటి ఫేక్ కాల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు మరియు ప్రభుత్వ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతారహితంగా ఇటువంటి మెయిల్స్ పంపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.