Telangana: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ..
Telangana: పెరుగుతున్న భానుడి ప్రతాపాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ..
Telangana: పెరుగుతున్న భానుడి ప్రతాపాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు.. మూడు నెలలకు సరిపడా రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
ప్రస్తుతం మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. రానున్న ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ దుకాణాల వద్ద ఎండలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. ఏప్రిల్ నెలలోనే మూడు నెలల బియ్యాన్ని అందజేయాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులకు నెలకు 6 కిలోల చొప్పున 'సన్నబియ్యం' పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కోటికి పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. కేంద్రం సూచన మేరకు 3 నెలల కోటాను ఒకేసారి ఇవ్వడానికి అవసరమైన బియ్యం నిల్వలు మరియు రవాణా సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తోంది.
కేంద్రం నిర్ణయం రవాణా ఖర్చులను తగ్గించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మూడు నెలల కోటా పొందాలంటే లబ్ధిదారులు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. సర్వర్ సమస్యల వల్ల ఒక్కో కార్డుకు 15 నుండి 20 నిమిషాల సమయం పడుతుండటం డీలర్లకు తలనొప్పిగా మారింది. రేషన్ దుకాణాల్లో ఒకేసారి మూడు నెలల స్టాక్ ఉంచేంత స్థలం లేదని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వర్షాకాలంలో ఇలాగే మూడు నెలల కోటా ఇచ్చినప్పుడు లబ్ధిదారులు, డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ లోపాలను సరిదిద్దడంపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు.
త్వరలోనే ఈ ముందస్తు రేషన్ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం నుండి అధికారిక మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.