Revanth Reddy: భారీ పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ దావోస్ పర్యటన
Revanth Reddy: నేటి నుంచి ఈనెల 18వరకూ దావోస్ పర్యటన
Revanth Reddy: భారీ పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ దావోస్ పర్యటన
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. రాష్టానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా.. నేడు దావోస్ వెళ్తున్నారు. నేటి నుంచి 18 వరకు దావోస్ పర్యటన కొనసాగనుంది. స్వి్ట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అధికారిక బృందం వెళ్తోంది. అక్కడ జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సుకు సీఎం హాజరు అవుతారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతామని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. గతంలో ఇప్పటివరకూ ఐటీ మినిస్టర్‌గా ఉన్న కేటీఆర్ దావోస్ పర్యటనను పూర్తి చేశారు. తాజాగా వెళ్తున్న రేవంత్ రెడ్డి బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి తో పాటు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి కూడా ఉన్నారు. విదేశీ, భారతీయ పారిశ్రామికవేత్తలను కలుసుకొని కొత్త ప్రభుత్వ విజన్, ప్రాధాన్యతలను వివరించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవకాశం ఇస్తుందని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది చక్కటి వేదిక అని ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల దావోస్ పర్యటనలో దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నామని వెల్లడించారు.
భారత్ కు చెందిన టాటా, విప్రో, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్లు, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీ అవ్వడమే కాకుండా సిఐఐ, నాస్కం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్న వారిలో నొవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓ లు ఉన్నారని తెలిపారు. తెలంగాణతో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి బలమైన వ్యవస్థీకృత సంబంధాలు ఉన్నాయని, హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ రంగంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించిన సెంటర్ ఫర్ 4త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ సదస్సు హైదరాబాదులో జరగబోతున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో సాంకేతిక ఉపక్రమణలకు ఆ సంస్థ క్రియాశీలకంగా మద్దతిస్తోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.