Sankranthi: సంక్రాంతికి సొంత ఊరు ప్రయాణాలు.. సాధారణ బస్సు చార్జీలపై రెట్టింపు వసూళ్లు

Sankranthi: మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సుల్లో సైతం అధిక ఛార్జీలు వసూలు

Update: 2024-01-10 14:45 GMT

Sankranthi: సంక్రాంతికి సొంత ఊరు ప్రయాణాలు.. సాధారణ బస్సు చార్జీలపై రెట్టింపు వసూళ్లు

Sankranthi: సంక్రాంతి పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ చేసే దోపిడీ అంతా ఇంతా కాదు. ప్రతీ సంవత్సరం ఇదే తంతు. పండక్కి సొంతూళ్లకు వెళ్లి తమ వాళ్లతో సంతోషంగా గడుపుదామనుకుంటే.. ఆ ప్రయాణాన్ని పీడకలలా మార్చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఆర్టీసీ బస్సులు చాలవు. ప్రైవేట్ వాహనాల దోపిడీ అయితే మామూలుగా ఉండదు. పండుగల సమయంలో సొంతూళ్లకు వెళ్లడం కంటే.. మామూలు రోజుల్లో వెళ్లడం బెటరేమో అని ప్రజలు అనుకునేలా చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఇదో పెద్ద దందాలా తయారైంది.

ఆర్టీసీ బస్సులేమో సరిపోవు. రైళ్లు ఖాళీ ఉండవు. ప్రయాణికులు వేరే దారి లేక ప్రైవేట్ ట్రావెల్స్‌ని ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ఏటికేడు భారీగా ఛార్జీలు దండుకుంటూ.. దోపిడీని కొనసాగిస్తూ.. ప్రైవేట్ ట్రావెల్స్.. మాఫియాలా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సంక్రాంతికి సొంత ఊరు ప్రయాణాలు మొదలుకావడంతో.. పండక్కి సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారికి షాక్ ఇస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ప్రయాణికులను నిలువునా దోపిడీ చేసేస్తున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో ఎలాంటి బస్సు ఎక్కినా ఇదే అదనుగా భావించి ధరల మోత మోగిస్తున్నాయి. ఏసీ, నాన్ ఏసీ, సీటింగ్, స్లీపర్ అన్నింటిలోనూ రేట్లు గూబ గుయ్‌మనేలా ఉంటున్నాయి. ఇప్పటికే అన్ని రెగ్యులర్‌ రైళ్లు, ప్రత్యేక రైళ్లు ఈ నెల చివరి వరకు పూర్తిగా బుక్‌ అయిపోవడంతో ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తున్నారు.

దీంతో పండుగ రద్దీ కంటే ముందే ప్రైవేట్‌ బస్సులు దోపిడీకి తెరతీశాయి. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ రెగ్యులర్‌ సర్వీసుల్లో ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్‌ బస్సులకు సైతం డిమాండ్‌ నెలకొంది. ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్‌ బస్సులు ఇప్పటికే సాధారణ చార్జీలను రెట్టింపు చేశాయి.

ఈ సంవత్సరం కొన్నిచోట్ల 14, 15, 16న భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకుంటుంటే.. మరికొన్ని చోట్ల 15, 16, 17న పండుగ జరుపుకుంటున్నారు. అందువల్ల ఏపీకి చెందిన , కర్ణాటకలో ఉంటున్న చాలా మంది.. ఏపీకి వెళ్లేందుకు ముందుగా రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. 11, 12, 13 తేదీల్లో వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ ట్రావెల్స్.. ఛార్జీల రేట్లను డబుల్ చేసేశాయి.

హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు సైతం సంక్రాంతి దోపిడీకి తెరలేపాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో 450 వరకు చార్జీ ఉంటే.. ప్రస్తుతం 600 నుంచి 700కు పెంచినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, అమలాపురం, ఏలూరు తదితర రూట్లలో డిమాండ్‌ భారీగా ఉంది. హైదరాబాద్‌ నుంచి ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లు భర్తీ అయ్యాయి.

ఇటీవల ప్రకటించిన ప్రత్యేక రైళ్లలోనూ వెయిటింగ్‌ జాబితా 250 నుంచి 350 వరకు నమోదైంది. ప్రయాణికులు మరో గత్యంతరం లేక ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. రైళ్లు, ఆర్టీసీ బస్సుల తరహాలో ప్రైవేట్‌ బస్సుల్లోనూ ముందస్తు బుకింగ్‌లకు డిమాండ్‌ పెరిగింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చార్జీలను అడ్డగోలుగా పెంచారు.

ప్రైవేట్ ట్రావెల్స్‌ ఛార్జీల మాఫియాపై ప్రయాణికులు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతలా దోచేస్తుంటే ఆర్టీఓ, రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా కోట్ల రూపాయలు మామూళ్ల రూపంలో చేతులు మారుతున్నాయని అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రైవేట్ వాహనాల దోపిడీని నియంత్రించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News