Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించలేని దుర్మార్గుడు..నడిరోడ్డుపై సిమెంటు ఇటుకలతో దాడి
Pregnant wife beaten with cement bricks on the street in Hyderabad
Hyderabad: హైదరాబాద్ లో దారుణం జరిగింది. కడుపుతో ఉన్న భార్యను నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశాడో భర్తు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హఫీజ్ పేట ఆదిత్యనగర్ లో ఉంటున్న మహ్మద్ బసరత్ ఇంటీరియర్ పనులు చేస్తుంటాడు. 2023లో అజ్ మేర్ దర్గాకు వెళ్లాడు. బస్సు ప్రయాణంలో పశ్చిమబెంగాల్ కు చెందిన షబాన పర్వీన్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తే ప్రేమగా మారింది. 2024అక్టోబర్ లో కోల్ కతాకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని హఫీజ్ పేటకు తీసుకువచ్చాడు. వేరు కాపురం పెడదామన్న పర్వీన్ ఒత్తిడితో బసరత్ తల్లిదండ్రులను కాదని అదే బస్తీలో అద్దె తీసుకుని ఉంటున్నాడు.
అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పర్వీన్ గర్భం దాల్చింది. రెండు నెలల గర్భంతో ఉన్న ఆమెకు వాంతులు అధికమవ్వడంతో మార్చి 29న భర్త ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఏప్రిల్ 1న రాత్రి 10గంటల సమయంలో భార్యను డిశ్చార్జి చేయించుకుని బయటకు వచ్చాడు. ఈ క్రమంలో మళ్లీ గొడవ పడ్డారు. రెచ్చిపోయిన బసరత్ భార్యను ఆసుపత్రి ఎదురుగా ఉన్న రోడ్డుపై పడేసి దాడి చేశారు. పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకలు తీసుకువచ్చి ఆమె తలపై పలుమార్లు బలంగా కొట్టాడు. ఆమె మరణించిందని అనుకుని పారిపోయాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను నిమ్స్ కు తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.