Praja Palana: కోటి దాటిన ప్రజా పాలన దరఖాస్తులు.. నేటితో ముగియనున్న ప్రజాపాలన సభలు

Praja Palana: 17 వరకు అన్ని దరఖాస్తులు కంప్యూటరీకించే యోచన

Update: 2024-01-06 04:32 GMT

Praja Palana: కోటి దాటిన ప్రజా పాలన దరఖాస్తులు.. నేటితో ముగియనున్న ప్రజాపాలన సభలు

Praja Palana: అభయహస్తం కింద ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగింపు దశకు చేరుకుంది. నేటితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ సభలు గత నెల 31, జనవరి 1తేదీ మినహా మిగిలిన రోజుల్లో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. గ్రామ, వార్డు, డివిజన్‌ సభల ద్వారా అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. చివరి రోజు భారీగా అర్జీలు అందే అవకాశాలు ఉన్నాయి.

అప్లికేషన్లకు లోటు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఇప్పటి వరకు ఇప్పటి వరకు ప్రజాపాలన దరఖాస్తులు కోటి దాటాయి. మొత్తం 7 రోజుల్లో 1కోటి 08లక్షల 94వేల 115 దరఖాస్తులు వచ్చాయి. 6 గ్యారెంటీల కోసం 93లక్షల 38వేల 111 దరఖాస్తులు వచ్చాయి. మిగతా అవసరాల కోసం 15,55,704 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క గ్రేటర్ పరిధిలో ప్రతిరోజూ 2 లక్షలకు పైగా అప్లికేషన్ లు వచ్చినట్లు తెలిసింది. ఎక్కువ మంది కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

ప్రజాపాలన సభల్లో స్వీకరించిన దరఖాస్తుల్ని కంప్యూటీకరించేందుకు ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో డేటా ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత మండలాలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఆపరేటర్లు బృందాలుగా ఏర్పడి దరఖాస్తుల వివరాలను పోర్టల్‌లో పొందుపరిచే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత అర్జీదారు మొబైల్‌ నెంబర్‌కు సందేశం పంపించనున్నారు. ఈనెల 17 వరకు అన్ని దరఖాస్తులను కంప్యూటరీకించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. సంక్రాంతి పండుగ లోపే దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేసేలా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఇప్పటి వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన గ్రామాలు, పట్టణాల్లోనూ చివరిరోజు అధికారులు అర్జీలు తీసుకోనున్నారు.

Tags:    

Similar News