తెలంగాణలో మళ్లీ స్టార్ట్ అయిన ప్రజాపాలన దరఖాస్తులు
Praja Palana: రెండ్రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభం
తెలంగాణలో మళ్లీ స్టార్ట్ అయిన ప్రజాపాలన దరఖాస్తులు
Praja Palana: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తుల ప్రక్రియ.. రెండ్రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమైంది. గత నెల 28వ తేదీన ప్రారంభమైన ఆ కార్యక్రమానికి న్యూ ఇయర్ సందర్భంగా రెండ్రోజులు విరామం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈనెల 6వ తేదీ వరకు గ్రామ, వార్డుల్లో సభలు కొనసాగనున్నాయి. ప్రజాపాలనలో ఇప్పటివరకు 40 లక్షల 57 వేల పైగా దరఖాస్తులు స్వీకరించారు. పింఛన్లు, రైతు భరోసా పథకాలకు దరఖాస్తులపై ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఇప్పటికే పింఛను, రైతుబంధు వస్తున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది. కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది.
అయితే ఇప్పటికే 40 లక్షల 57 వేల 952 దరఖాస్తులు రాగా మరో 5 రోజులు ఉండటంతో వాటి సంఖ్య కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. దరఖాస్తుల తీరు, నిబంధనలపై పలు అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. పింఛన్లు, రైతుభరోసా కోసం ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు పథకాల కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. గతనెల 28 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 868 గ్రామాలు, 8 వేల 697 మున్సిపల్ వార్డుల్లో సదస్సులు నిర్వహించారు. 6 గ్యారెంటీల పథకాలు సహా రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో 40 లక్షల 57 వేల 592 దరఖాస్తులు రాగా రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
మరో వైపు దరఖాస్తులను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని.. తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. దరఖాస్తులను బయట విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన తర్వాత వచ్చిన సమాచారం ఆధారంగా ఎంతమందికి అవసరమనే అంచనా వచ్చాక పథకాల అమలు కోసం పూర్తిస్థాయి విధివిధానాలు, నిధుల కేటాయింపుపై కసరత్తు జరిగే అవకాశం ఉంది. ఇక దరఖాస్తుల స్వీకరణ అనంతరం లబ్ధిదారులను గుర్తించనుంది ప్రభుత్వం. ఏ పథకానికి ఎంతమంది అర్హులు ఉన్నారనే దానిపై క్లారిటీ ఇవ్వనుంది. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాగా డిసెంబర్ 7న కొలువుదీరిన నూతన ప్రభుత్వానికి 24 రోజులు పూర్తయ్యాయి. దీంతో మిగతా 76 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసేలా టార్గెట్ పెట్టుకుంది. మరో వైపు ఫిబ్రవరి 15 తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో భాగంగానే పథకాలను అమలు చేయాలని భావిస్తోంది.