PM Modi: నేడు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. 2 రోజుల టూర్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

PM Modi: స్వాగతం పలకనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై

Update: 2024-03-04 01:58 GMT

PM Modi: నేడు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. 2 రోజుల టూర్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం 

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మోడీ 56వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో ఎక్కువ భాగం విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. తన పర్యటనలో ప్రధాని బీజేపీ బహిరంగ సభల్లో కూడా పాల్గొని, ఎన్నికల ప్రచారం చేస్తారు.

ప్రధాని మోడీ..ఉదయం 10.20కి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తారు. ఆ తర్వాత ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి వెళ్తారు. అక్కడి ఆడిటోరియంలో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, ప్రధానికి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత మోడీ.. 6వేల 697 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. అందులో భాగంగా.. రామగుండం నేషల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. ఇంకా హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకూ 2వేల 136 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే 163ని ప్రారంభిస్తారు.

అనంతరం మోడీ..బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. తద్వారా ఇక్కడి నుంచే లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మధ్యాహ్నం 12.30కి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని టూర్ ముగుస్తుంది. తర్వాత మోడీ.. తమిళనాడు వెళ్తారు. తిరిగి రాత్రి 7.45కి హైదరాబాద్ వస్తారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.

రేపు ఉదయం 11గంటలకు ప్రధాని మోడీ సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ 9వేల21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఐఐటీ, నేషనల్ హైవేలు, గ్యాస్ పైప్‌లైన్ వంటి వాటిని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత మరో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇలా రెండ్రోజుల టూర్‌లో ప్రధాని మోడీ ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలిచే లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ.. అందుకు అనుగుణంగానే భారీ వ్యూహాన్ని రచించినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News