Telangana: 1 నుంచి 8వ తరగతి వరకు ఆన్‌లైన్‌లోనే క్లాసులు
Telangana: ప్రత్యక్ష బోధన లేకుండానే పైతరగతులకు పంపాలని విద్యాశాఖ యోచన
Telangana: కరోనా కారణంగా పాఠశాల విద్య అస్తవ్యస్తంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం గత సెప్టెంబర్ నుంచి ఆన్‌లైన్, డిజిటల్ పాఠాలను ప్రారంభించింది. టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్ల ద్వారా వీడియో పాఠాలను విద్యార్థుల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. చివరకు ఈ నెల 1 నుంచి పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం ప్రారంభించింది. పాఠశాలల్లో భౌతిక దూరం పాటిస్తూ, బెంచీకి ఒకరు చొప్పున, తరగతి గదిలో 20 మంది మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. అయితే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం బెంచీకి ముగ్గురు నలుగురు విద్యార్థులను కూర్చోబెడుతున్నారు.
పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించిన సమయంలోనే 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభించాలనే ఆలోచన చేశారు. అయితే 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధన సమయంలో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చూసి నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే పాఠశాలల్లో కరోనా వ్యాప్తి లేకపోయినా, ప్రైవేటు పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం మాత్రం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే, ఏదైనా అనుకోని సమస్య వస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు అధికారులు.
దీంతో 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేయడమే మంచిదన్న అభిప్రాయంలోనే అధికారులున్నారు. మరోవైపు మార్చి నెలలో 6, 7, 8 తరగతులను ప్రారంభించినా ఈ సమస్యలు వస్తాయని, పైగా మార్చిలో వేసవి ఎండలు ఎలా ఉంటాయో తెలియదు ఒంటిపూట బడులనే కొనసాగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధన అవసరమా..? అన్న సందిగ్ధం ఉన్నతాధికారుల్లో నెలకొంది. దీంతో ఓసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చూద్దామనే ఆలోచన చేస్తున్నారు.