TG EAPCET 2025: ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా
TG EAPCET 2025 online applications dates: తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుండి స్వీకరించాల్సి ఉన్న ఎప్‌సెట్ దరఖాస్తుల ప్రక్రియ మరో నాలుగు రోజులు వాయిదా పడింది. వచ్చే విద్యా సంవత్సరం ఇంజనీరింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఈ ఎప్‌సెట్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున హైదరాబాద్ జేఎన్టీయూ ఈ పరీక్షలను నిర్వహించనుంది.
ఈ ఎంట్రన్స్ పరీక్షల కోసం ఫిబ్రవరి 25 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు గతంలో ఎప్‌సెట్ పరీక్షల కన్వినర్, డీన్ కుమార్ తెలిపారు. కానీ తాజాగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ మార్చి 1వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభిస్తామని కుమార్ చెప్పారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సిందిగా చెబుతూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇదే విషయాన్ని అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లోనూ ( https://eapcet.tgche.ac.in/ ) పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌తో పాటు సూచనల కాపీని కూడా ఆరోజు నుండే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కన్వినర్ తెలిపారు.