Balkampet: నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. బల్కంపేటలో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
Balkampet Yellamma Kalyanam: కల్యాణోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
Balkampet Yellamma Kalyanam: ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే బల్కంపేట(Balkampeta) ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయి. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న ఎదుర్కోలు ఉత్సవంని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నేడు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని, అందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తలసాని వెల్లడించారు. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం రోజున అమ్మవారిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసమని మంత్రి తెలిపారు. ఆలయానికి వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులుఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా బారికేట్లను ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారి ప్రసాదం లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణానికి వచ్చారు. ఈ సారి కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ఏర్పాట్లు చేశారు. కల్యాణ మహోత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్‌ను ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. నేడు,రేపు రెండు రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీన్‌ల్యాండ్, అమీర్‌పేట సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మీదుగా కాకుండా ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్, కమ్యూనిటీ హాల్, బీకేగూడ క్రాస్ రోడ్డు, శ్రీరాంనగర్, సనత్‌నగర్ మీదుగా ఫతేనగర్ బ్రిడ్జిపైకి వెళ్లాల్సి ఉంటుంది. వాహనదారులు ప్రత్యాన్మాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు.