గందరగోళంలో నిజామాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రి

Update: 2019-12-26 11:16 GMT
గందరగోళంలో నిజామాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రి

అధికారుల అలసత్వం సిబ్బంది నిర్లక్ష్యం నిజామాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలో పేద రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. మందులు అందుబాటులో లేకపోవడంతో పాటు వ్యాధి పరీక్షలకు రసాయనాల కొరతతో వ్యాదిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు జిల్లాల పరిధిలో ఉన్న నిజామాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగుల అవస్థలపై హెచ్‌ఎంటీవీ ప్రత్యేక కథనం.

ఇది నిజామాబాద్ లోని 50 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 15 వేల మంది ఈఎస్ఐ ఖాతాదారులకు సేవలందించే ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఈఎస్ఐ కుంభకోణంతో గత 3 నెలలుగా ముందుల సరఫరా నిలిచిపోయింది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులకు మందులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఆసుపత్రిలోని రోగ నిర్ధారణ కేంద్రంలో రసాయనాల కొరత పట్టిపీడిస్తోంది. ఫలితంగా రోగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఎక్స్ రే లు నిలిచిపోయాయి. రసాయనాలు లేవని, ఎక్స్ రే ఫిల్మ్ లు లేవంటూ పేషెంట్లను వెనక్కి పంపుతున్నారు.

ఇక అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో అప్పుడే సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పర్యావేక్షణ లేకపోవడంతో బెడ్లు చిరిగిపోయాయి. ఓపీ రోగులకు తప్ప, ఇతర రోగులను హైదరాబాద్ ఈఎస్ఐకి పంపిస్తున్నారు. ఈ ఆసుపత్రి పరిధిలో రెండు డిస్పెన్సరీలు ఉన్నా వాటిలో కూడా మందుల సరఫరా నిలిచిపోయింది. ఉన్నత స్ధాయిలో జరిగిన ఔషధాల కుంభకోణంతో ఈఎస్ఐ కార్డు ఉన్న రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విచారణ పేరుతో మందులు సరఫరా నిలిపి వేసి ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళన చేపడతామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే మందులను త్వరలో తెప్పించి రోగులకు ఇబ్బందులు లేకుండా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని కార్మికులు కోరుతున్నారు. ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Full View 

Tags:    

Similar News