కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ... మీ సేవ కేంద్రాల వద్ద భారీగా క్యూలైన్స్
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ... మీ సేవ కేంద్రాల వద్ద భారీగా క్యూలైన్స్
తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు మీసేవ కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారు. దీంతో మీసేవ కేంద్రాల వద్ద భారీ రద్దీ వాతావరణం కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుండే మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ మీసేవ విభాగం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటోంది.
తెలంగాణలో 2023 చివర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. 2024 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డ్స్ కోసం జనం నుండి అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి చివర్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ మొదలుపెట్టారు. కానీ వారిలో కూడా చాలామందికి రేషన్ కార్డులు అందలేదనే ఆరోపణ ఉంది.
రేషన్ కార్డు రాని వారి నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డు రానివారికి మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం నుండి మీ సేవా కేంద్రాల్లో వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాల వద్ద పోటెత్తారు. భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో మీసేవా కేంద్రాల వద్ద భారీగా క్యూలైన్స్ దర్శనమిస్తున్నాయి.