Telangana Farmers: చెరుకు రైతులకు కొత్త చిక్కులు

Telangana: కొత్తూరులోని షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో అష్టకష్టాలు పడుతున్నారు.

Update: 2021-02-19 09:23 GMT

చెరుకు రైతులు (ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: సంగారెడ్డి జిల్లా చెరుకు రైతులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కొత్తూరులోని షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో అష్టకష్టాలు పడుతున్నారు. దూర ప్రాంతాల్లో పంటను అమ్ముకోవడంతో నష్టాలపాలవుతున్నారు. బంద్ అయినా షుగర్ ఫ్యాక్టరీని వచ్చే సీజన్ లోనైనా తెరిపించాలని వేడుకుంటున్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు చెరుకు పంటను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. రైతుల సౌలభ్యం కోసం గతంలో కొత్తూరులో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులు పంటను అమ్ముకునేందుకు సౌలభ్యంగా ఉండేంది.

ట్రైడెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం మారింది. నందకుమార్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. గత ఏడాది నామమాత్రంగా ఫ్యాక్టరీ నడిపించిన ఆయన ఈ సారి బంద్ పెట్టారు. ఫ్యాక్టరీ మూతపడడంతో పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు.

ట్రైడెంట్ ఫ్యాక్టరీ తెరవకపోవడంతో రైతులు 200 నుంచి 300 కిలో మీటర్ల దూరంలోగల చక్కెర ఫ్యాక్టరీల్లో పంటను అమ్ముకున్నారు. ట్రాన్స్ పోర్టు ఖర్చులు తడిసిమోపడయ్యాయి. రైతులకు తీవ్ర నష్టం వచ్చింది. ఇంకా బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సారి జహీరాబాద్ ప్రాంతంలో వర్షాలు బాగాపడ్డాయి. గతంలో ఎన్నడూలేనివిధంగా అందరూ చెరుకును పండిస్తున్నారు. వచ్చే సీజన్ లోనైనా ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి, తమకు నష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు వేడుకుంటున్నారు. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని లేకుంటే తమకు మరోసారి నష్టాలు తప్పవని ఆందోళన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News