దేశవ్యాప్తంగా హైఅలర్ట్.. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనతో కేంద్ర హోంశాఖ అప్రమత్తం
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన నేపధ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ హైఅలర్ట్ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా హైఅలర్ట్.. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనతో కేంద్ర హోంశాఖ అప్రమత్తం
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన నేపధ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ హైఅలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో బాంబు పేలుడు ఘటనతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. దీంతో.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
ఇక హైదరాబాద్ సిటీలో నాకా బందీ ఏర్పాటు చేసి రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మతపరమైన ప్రాంతాలు, పర్యాటక కేంద్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పార్కింగ్ చేసిన కార్లు, లాడ్జిల్లో అనుమానితులపై ఫోకస్ పెట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్ని సీపీ సజ్జనార్ నగర ప్రజలకు సూచించారు.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అనుమానితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తు్న్నారు. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనతో యావత్ దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు. మరికొంతమంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.