ప్రిన్సిపల్ Vs స్టాప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నల్గొండ మెడికల్ కాలేజ్...

Nalgonda Medical College: 57 మంది వైద్యులకు నోటీసులు జారీ...

Update: 2022-05-29 06:30 GMT

ప్రిన్సిపల్ Vs స్టాప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నల్గొండ మెడికల్ కాలేజ్...

Nalgonda Medical College: నల్గొండ మెడికల్ కాలేజ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రిన్సిపాల్‌కు, సిబ్బందికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. విధుల్లో అలసత్వం వహించారని 57 మంది వైద్యులకు ప్రిన్సిపాల్ నోటీసులు జారీ చేయగా... ఇది కక్షపూరిత చర్యంటూ సిబ్బంది ఆందోళన బాట పట్టింది. నల్గొండ మెడికల్ కాలేజ్‌లో వివాదమేంటి ? అసలేం జరుగుతుంది ?

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రిన్సిపల్‌కి, మెడికల్ సిబ్బందికి మధ్య నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. వైద్యులు సెలవులు, పండుగ రోజుల్లో విధులకు హాజరు కాలేదని 57 మందికి నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. ప్రిన్సిపల్ కావాలనే తమపై కక్ష సాధింపుతో నోటీసులు జారీ చేసారని వైద్యులు నల్ల బ్యాడ్జీలతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో ధర్నాకి దిగారు.

మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమతో కఠినంగా వ్యవహరిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. పండుగలు, ఆదివారాల సెలవులు పొందే హక్కును హరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రిన్సిపల్ నిరంకుశ వైఖరి విడనాడాలన్నారు. లేదంటే ఆమెను సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

మరోవైపు వైద్యుల అటెండెన్స్ కోసం బయోమెట్రిక్ సిస్టమ్ ఉందని... ఎగ్జిట్ బయోమెట్రిక్ నమోదు లేని వాళ్లకు మాత్రమే నోటీసులు పంపామని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. సాలరీస్ కోసం అటెండెన్స్‌ వివరాలు కావాలని మాత్రమే మెమోలు పంపినట్లు వెల్లడించారు. బయోమెట్రిక్ ఎంట్రీస్ సరిగా లేని సిబ్బందిపై మాత్రమే రూల్స్ ప్రకారం ఆక్షన్ తీసుకుంటున్నామంటున్నారు.

ఇదిలా ఉండగా ఉన్నతాధికారులు మెమోలు వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. అయినప్పటికీ వైద్యులు మాత్రం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసేవరకు నిరసన దీక్షలు విరమించేది లేదంటున్నారు

Tags:    

Similar News