ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది.
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. తెలంగాణలో ఐదు, ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మార్చి 20న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి 3న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా హసన్ ఎఫెండీ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగా కృష్ణమూర్తి రామారావు, ఆశోక్ బాబు, తిరుమలనాయుడు, యనమల రామకృష్ణుడు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఉన్న సంఖ్య ఆధారంగా ఆ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల ఆధారంగా ఆ పార్టీకి ఒక్క సీటు దక్కనుంది.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే దక్కే చాన్స్ ఉంది. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఉన్న సభ్యులు 11 మందే. ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలంతో ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం లేదు.
నాగబాబుకు మంత్రి పదవి
ఆంధ్రప్రదేశ్ లో జనసేన నుంచి చంద్రబాబు కేబినెట్ లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగ బాబుకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. నాగబాబుకు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించారు. అయితే ఈ సీటును బీజేపీకి కేటాయించారు. బీజేపీ తరపున ఈ సీటు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు దక్కింది. అయితే ఎమ్మెల్సీగా నాగ బాబును నామినేట్ చేసి కేబినెట్ లోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. ఏపీలో ఐదు ఎమ్మెల్సీ సీట్లు టీడీపీ కూటమికే దక్కనున్నాయి. అయితే జనసేనతో పాటు బీజేపీకి కూడా ఎమ్మెల్సీ కేటాయిస్తారా? మిగిలిన నాలుగు స్థానాల్లో టీడీపీ తన అభ్యర్థులను బరిలోకి దింపుతుందా ఇంకా స్పష్టత రాలేదు.