Nizamabad IT Hub: ఈరోజు నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

Nizamabad IT Hub: ప్రతీ నెల జాబ్ మేళా నిర్వహిస్తామన్న ఎమ్మెల్సీ కవిత

Update: 2023-08-09 03:15 GMT

Nizamabad IT Hub: ఈరోజు నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

Nizamabad IT Hub: నిజామాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణం పూర్తి అయింది. అత్యాధునిక టెక్నాలజీ, కార్పొరేట్ హంగులు, విశాలమైన గదులతో నిర్మించిన ఈ టవర్.. ఇందూరు ప్రాంతానికి సరికొత్త ఐటీ సొబగులను తెచ్చిపెట్టింది. బైపాస్ రోడ్డు సమీపంలో ఇప్పటికే సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టగా... దీన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో మూడు అంతస్తుల్లో ఐటీ టవర్‌ను నిర్మించడంతో నిజామాబాద్ కళకళలాడుతోంది

ఈరోజు ఐటీ మంత్రి కేటీఆర్ ఈ హబ్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌లు ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో న్యాక్ సెంటర్, మినీ ట్యాంక్ బండ్, మూడు వైకుంఠ దామాలను మంత్రి ప్రారంభించనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ గులాబీ మయంగా మారింది. భారీ ఎత్తున ఫ్లెక్సీలు కటౌట్లు ఎర్పాటు చేశారు.

ఐటీ టవర్ ప్రారంభం అనంతరం కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేయనున్నారు, ఆ తర్వాత పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్న తెలంగాణ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్​, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రేపు నిజామాబాద్​ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నారు.

ఐటీ పరిశ్రమ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించి యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రారంభమైన ఐటీ టవర్లలో పలు సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. కేవలం హైదరాబాద్‌లోనే పెట్టుబడులు పెట్టకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం ఐటీ సంస్థలను పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నిజామాబాద్ ఐటీ టవర్‌లో ఇప్పటికే పలు కంపెనీలు నియామక ప్రక్రియ ప్రారంభించాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ నెల 29న మరో జాబ్ మేళా ఉంటుందని తెలిపారు. అమెజాన్, HDFC, గూగుల్, టెక్ మహీంద్రా, IBM వంటి 52 అంతర్జాతీయ కంపెనీలు మేళాకు వస్తున్నాయని.. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నిజామాబాద్ ఇందూరు ఐటీ టవర్‌లో కార్యకలాపాల నిర్వహణకు ఇప్పటికే 15 కంపెనీలతో ఐటీ శాఖ ఒప్పందాలను కుదుర్చుకుంది. టాస్క్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఐటి జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. 12 వేల మంది అభ్యర్థులు జాబ్ మెళాకు తరలివచ్చారు. 250 మంది సెలక్ట్ అవగా వారికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నియామక పాత్రలు అందించనున్నారు. ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి విదేశీ కంపెనీలను ఇక్కడికి రప్పించేందుకు ఎమ్మెల్సీ కవిత కృషి చేశారు. ఇందులో భాగంగానే చాలా అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటి టవర్‌లో ఒక్కో చైర్‌కు ప్రభుత్వం నెలకు 3వేల 600 రూపాయలు కేటాయించనుంది. కేవలం ఐటి ఉద్యోగాలే కాకుండా 10వ తరగతి నుంచి.. పీజీ విద్యార్థుల వరకు వివిధ అవకాశాలను కల్పిస్తున్నారు. టాస్క్ ద్వారా వారికి శిక్షణను అందిస్తున్నారు.. ముఖ్యంగా వికలాంగులకు ప్రత్యేక కోటాను ఐటీ హబ్‌లో కేటాయించామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇక నుంచి ప్రతీ నెల జాబ్ మేళా నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 

Tags:    

Similar News