నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన

Minister KTR : పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

Update: 2022-05-15 02:00 GMT

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన

Minister KTR: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేటీఆర్ వెంట ఒకేసారి ఆరుగురు మంత్రులు రావడం చర్చనీయాంశంగా మారింది. జలమండలి ఆధ్వర్యంలో 14వందల 50కోట్ల అంచనా వ్యయంతో భారీ ఇన్ టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ నిర్మాణ పనులను మంత్రులు ప్రారంభించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రజల తాగు నీటి అవసరాలను తీర్చేందుకు శాశ్వత పరిష్కరంగా వీటి నిర్మాణానికి పూనుకుంది తెలంగాణ సర్కార్.

దేశంలో ఎన్నో సుందర నగరాలు తాగునీటి, విద్యుత్, ట్రాఫిక్, పొల్యూషన్ వివిధ రకాల సమస్యలతో ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన సమస్యలను గుర్తించి ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇక ఏడాది హైదరాబాద్‌ కు 37టీఎంసీల తాగునీరు అందుతుందన్నారు మంత్రి కేటీఆర్. అలాగే వచ్చే 50 సంవత్సరాలకు 71 టీఎంసీల నీటి అవసరముందని ముందస్తు ఆలోచనతో ఆదిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ఇన్ టెక్ వెల్ మూడు లైన్ల పైప్ లైన్ ద్వారా కోదండపురం వరకు నీటిని పంపించి తద్వారా హైదరాబాద్‌కి తరలిస్తామన్నారు. వచ్చే వేసవి కాలం నాటికి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ప్రజలకు శాశ్వతంగా తాగునీరు అందించనున్నట్లు తెలిపారు.

సుంకిశాలలో ప్రాజెక్ట్ పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఆ తర్వాత నేరుగా హెలికాప్టర్ ద్వారా నందికొండకు చేరుకున్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా బుద్ధవనాన్ని మంత్రులు ప్రారంభించారు. ముందుగా బుద్దవనం ప్రారంభిస్తారని ఆహ్వాన పత్రాలు ముద్రించి.. అటుపై సందర్శన మాత్రమే ఉంటుందని ప్రకటించారు అధికారులు. అయితే చివరి నిమిషంలో బుద్ధవనం ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇదిలా ఉంటే 274 ఎకరాల్లో 90 కోట్ల రూపాయాలతో ప్రపంచ ప్రముఖ బౌద్ధక్షేత్రంగా బుద్ధవనం రూపుదిద్దుకుంది. ఇక్కడ బౌద్ధ సంస్కృతిని విస్తరించేలా.. బౌద్ధుడి జీవిత చరిత్రను శిల్పాల రూపంలో ఒకే చోటుకి చేర్చింది తెలంగాణ పర్యాటక సంస్థ. బుద్ధవనంలో చేపట్టిన అపురూప నిర్మాణాలను కేబినెట్ మంత్రులతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. పూర్తిగా విదీశీ పరిజ్ఞానంతో నిర్మించిన మహాస్థూపాన్ని పరిశీలించి ప్రశంసించారు.

బుద్దవనం ప్రారంభం అనంతరం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా పట్టణంలో హాలియా మున్సిపాలిటీ, నందికొండ మున్సిపాలిటీలలో 56 కోట్ల చేపట్టిన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం.. ఈ రెండు జోడెద్దుల బండిలా ముందుకు సాగుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఒక్క నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే 825 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు మంత్రి వివరించారు. నెల్లికల్ లిఫ్ట్ పనులు 670 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ జిల్లాలో ఫ్లోరోసిస్‌తో అనేక సంవత్సరాలు ప్రజలు అవస్థలు పడ్డారు అని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి 46 వేల కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రం మొత్తం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో నాగార్జునసాగర్ లో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. పబ్ లు, క్లబ్ లు తప్పా వ్యవసాయం అంటే ఏంటో రాహుల్ గాంధీకి తెలియదని ఎద్దెవచేశారు. 

Tags:    

Similar News