Etela Rajender: సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి:మంత్రి ఈటెల

Etela Rajender: భూ కబ్జా ఆరోపణలపై తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

Update: 2021-05-01 00:53 GMT

Etala Rajender:(File Image) 

Etela Rajender: భూ కబ్జా ఆరోపణలపై తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ''నేను ముదిరాజ్ బిడ్డను (బీసీ). సావనన్న సస్తాను కానీ భయపడను. నా ఆత్మగౌరవం కంటే ఈ పదవి గొప్పది కాదు.'' అని వ్యాఖ్యానించారు. ఇదంతా ముందస్తు ప్రణాళికలతో, కట్టుకథలతో వివిధ ఛానెళ్ల ద్వారా తన వ్యక్తిత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం జరిగిందని మంత్రి ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. అసెన్డ్ భూములను కబ్జా చేసి ఈటల ఆక్రమించుకున్నారని ఒకేసారి ఈ ఛానెళ్లన్నీ ప్రసారం చేయడం నీతిమాలిన పని అని ఈటల కొట్టిపారేశారు. అంతిమ విజయం ధర్మం, న్యాయానిదే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

''2016లో జమున హ్యాచరీస్ పేరుతో కోళ్ల ఫారాలను అచ్చంపల్లి, హకీంపేట గ్రామాల వద్ద పెట్టాం. ఆనాడు భూములను రూ.6 లక్షల చొప్పున కొన్నాం. దాదాపు 40 ఎకరాలు కొని షెడ్లు కట్టాం. ఆ తర్వాత విస్తరణ కోసం ఏడెకరాలు కొన్నాం. కెనరా బ్యాంకు ద్వారా రుణం తీసుకొని విస్తరణ చేస్తూనే ఉన్నాం. ఈ పౌల్ట్రీకి అత్యధిక స్థలం కావాలి కాబట్టి.. ఈ విస్తరణకు సంబంధించి పరిశ్రమల శాఖకు ప్రతిపాదన పెట్టా. పెట్టుబడిదారులకు భూములు చౌకగా ఇస్తున్నారు.. రాయితీలు ఇస్తున్నారు.. నా పౌల్టీ పరిశ్రమకు కూడా భూములు కేటాయించాలని కోరా. అది 1994లో స్థానికులకు ఇచ్చారు.

తొండలు గుడ్లు పెట్టని, వ్యవసాయానికి పనికిరాని భూమిని దాని యజమానులు నాకు అమ్ముతామని వచ్చారు. కానీ అది కొనేందుకు, అమ్మేందుకు వీలుకాదని నేను చెప్పా. రైతులు స్వచ్ఛందంగా సరెండర్ చేస్తే ఇండస్ట్రీయల్ కార్పోరేషన్ ద్వారా ఇవ్వొచ్చని అధికారులు నాకు చెప్పారు. అంతేకానీ, ఇలాంటి నాపై దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడక్కడ ఒక్క ఎకరం కూడా నా స్వాధీనంలో లేదు.''

''నేను స్కూటర్‌పై తిరిగి వేలకోట్లు సంపాదించలేదు. నాకు చేతికి గడియారం పెట్టుకునే సోకు లేదు. రేమండ్ గ్లాస్‌లు పెట్టుకునే అలవాటు లేదు. నా గురించి అందరికీ తెలుసు. నాపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్రం, దేశంలో ఎన్ని విచారణ సంస్థలు ఉంటే అన్నింటితో విచారణ చేయించాలి. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవచ్చు. నయీమ్ బెదిరింపులకే భయపడలేదు. ఒక్క ఎకరం నేను కబ్జా చేసినా ఏ శిక్షకైనా సిద్ధమే'' అని ఈటల అన్నారు.

Tags:    

Similar News