Medaram: నేటి నుంచి మేడారం జాతర

Medaram: ఇవాళ గద్దెపైకి సారలమ్మ, రేపు సమ్మక్క

Update: 2022-02-16 02:07 GMT

Medaram: నేటి నుంచి మేడారం జాతర

Medaram: ఆలయం లేని అపూర్వ పుణ్యక్షేత్రం. గద్దెలే గర్భ గుడులుగా కొలువుతీరనున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. మేడారం అటవీ ప్రాంతం జనారణ్యంగా మారింది. జంపన్నవాగు జలజలాపారుతూ.. తెలంగాణ కుంభమేళాలో భక్తుల పుణ్యస్నానాలకు సిద్ధమైంది. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు మేడారం విద్యుత్తు వెలుగులు జిగేల్‌మంటున్నాయి. అమ్మల జాతరకు పదండిపోదాం.. అంటూ అశేష భక్తజనం కదంతొక్కారు. కాలినడకన, ఎడ్లబండ్లు, కార్లు, ఆటోలు, జీపులు, బస్సుల్లో తరలివస్తున్నారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవుల్లో జరిగే ఈ మహా జాతరకు.. ఏపీ, తెలంగాణతో పాటు... ఛత్తీ్‌సగఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిసా నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం జరిగే ఈ జాతరలో దేవతామూర్తుల విగ్రహాలు ఉండవు. హోమాలు, యాగాలు అస్సలే కనిపించవు. ప్రకృతినే దైవంగా భావించి ఇక్కడ పూజలు జరుగుతాయి. వనదేవతల స్మారకార్థం నిర్మించిన కర్రల వద్దే.. గద్దెలపై పూజలు నిర్వహిస్తారు. పసుపు కుంకుమలు, ఒడి బియ్యం, ఎదుర్కోళ్లు, బంగారం ప్రధాన మొక్కులు.

భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాఘ పౌర్ణమి క్షణాలు సాక్షాత్కరించనున్నాయి. తొలిరోజునే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెకు చేరుకుంటారు. జంపన్నను మంగళవారమే గద్దెపైకి చేర్చారు. ఇక ఇవాళ తొలుత కన్నెపల్లి ఆడపడుచు సారలమ్మకు పూజారి సారయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత అమ్మవారిని గద్దెలపైకి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

పూజారి పెనుక బుచ్చిరాములు ఆధ్వర్యంలో ఆదివాసీలు కాలినడకన ఇవాళ సాయంత్రానికి మేడారానికి చేరుకుంటారు. పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజులు కూడా నేడు ప్రధాన పూజారి దుబ్బకట్ల గోవర్ధన్‌ నేతృత్వంలో ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి పడిగె రూపంలో బయలుదేరి, మేడారాన్ని చేరుకుంటారు. దీంతో తొలిరోజు జాతర అట్టహాసంగా ప్రారంభమవుతుంది. రేపు పూజారి కొక్కెర కిష్టయ్య నేతృత్వంలో.. చిలకలగుట్టపై ఉండే సమ్మక్కను వేడుకగా తోడ్కొని వస్తారు. గురువారం రాత్రి 10 గంటలకల్లా సమ్మక్కను గద్దెపైకి చేరుస్తారు. అప్పటి నుంచి శనివారం సాయంత్రం వరకు మొక్కులు కొనసాగుతాయి. సాయంత్రం 6కు సమ్మక్క చిలకలగుట్టకు తిరుగు ప్రయాణం అవుతుంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా స్వగ్రామాలకు పయనమవుతారు. దీంతో జాతర ముగుస్తుంది.

Tags:    

Similar News