తెలంగాణలో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు.. జర భద్రం!

Telangana: నకిలీ వెబ్‌ సైట్‌లతో చలాన్లు వసూల్‌ చేస్తున్న కేటుగాళ్లు

Update: 2024-01-04 03:07 GMT

తెలంగాణలో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు.. జర భద్రం! 

Telangana: పెండింగ్‌ చలాన్లు కట్టడానికి తెలంగాణ పోలీసులు బంపర్‌ ఆఫర్‌ ఇస్తే.. దాన్నీ రాంగ్‌రూట్‌లో క్యాష్‌ చేసుకుని అడ్డంగా దోచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఏకంగా చలాన్లు కట్టేందుకు నకిలీ వెబ్‌సైటే తెరిచేసి అడ్డగోలు దందా మొదలెట్టారు సైబర్‌ నేరగాళ్లు. ఈ విషయం గుర్తించిన వెంటనే దాన్ని బ్లాక్‌ చేసిన పోలీసులు.. పబ్లిక్‌ని ఎలర్ట్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వాహనాల చలాన్స్ రాయితీలో చెల్లించేందుకు సర్కార్ అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని చాలామంది వాహనదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో రెడీ అయ్యారు. ఇంకేముంది నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఖాకీల ఖజానాకు గండికొడుతున్నారు. దీంతో మాయగాళ్ల బారినపడకుండా ఉండేందుకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్‌ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ డిస్కౌంట్‌ పెట్టింది. టూవీలర్స్, త్రీ వీలర్స్‌పై 80 శాతం, ఆర్టీసీ బస్సులపై 90 శాతం, కార్లు సహా ఇతర ఫోర్‌ వీలర్లకు 60 శాతం రాయితీ ప్రకటించారు. దీంతో చాలా మంది వాటిని క్లియిర్‌ చేస్తున్నారు. ఇదే అదనుగా ఫేక్‌ వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేసి మోసానికి తెరతీశారు సైబర్‌ నేరగాళ్లు. నకిలీ వెబ్‌సైట్‌లతో చలాన్లు వసూల్‌ చేస్తున్నారు కేటుగాళ్లు. నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి చలాన్లు వసూలు చేస్తుండటాన్ని గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్ సైట్లలో చలాన్లు చెల్లించొద్దని.. పోలీసులు సూచించిన అధికారిక వెబ్‌సైట్‌లోనే చెల్లించాలని సూచిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్లను రూపొందించిన వారిని గుర్తించేందుకు విచారణ జరుపుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

ఈ-చలాన్‌ టీఎస్ ‌పోలీస్‌.IN పేరుతో నకిలీ వైబ్‌సైట్ క్రియేట్‌ చేశారు కేటుగాళ్లు. అధికారికంగా అయితే ఈ-చలాన్.‌TS‌పోలీస్.GOV.IN పబ్లిక్‌వ్యూ వెబ్‌సైట్‌లో మాత్రమే చెల్లించాలి. లేదంటే పేటీఎం, మీ-సేవా సెంటర్స్‌లో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చు. పోలీస్‌ వెబ్‌సైట్ కాకుండా ఇతర ఆప్షన్లు కూడా ఉండడంతో ఈ తరహాలోనే పబ్లిక్‌ని చీట్‌ చేసేందుకు ఏకంగా ఈ-చలాన్‌ టీఎస్ ‌పోలీస్‌.IN అని క్రియేట్‌ చేశారు. TS పోలీస్‌ అనే పదాలు చూసి చాలామంది ఇదే ఒరిజినల్ అనుకుని డబ్బులు కట్టారు.

గతంలో ఈ విధంగానే ఢిల్లీలో వాహదారుల నుంచి సొమ్ము కాజేసిన సైబర్ ముఠా హైదరాబాద్‌లో దిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పెండింగ్ చలాన్లపై ఇచ్చిన రాయితీని తమకు అనువుగా మలుచుకున్నారు. కేవలం అక్షరం మార్పుతో ఫేక్ వెబ్ సైట్ రూపొందించి సోషల్ మీడియా, సెల్ ఫోన్ నెంబర్లకు లింకులు పంపిస్తున్నారు. ఇది నిజమేనని భావిస్తున్న వాహనాదారులు నగతు చెల్లించగానే.. అటు వైపు నుంచి నగదు జమ చేసినట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. పోలీసులు వెబ్‌సైట్‌లో పరిశీలిస్తే చలానాలు అలాగే కనిపించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి మోసాల బారినపడకుండా ఉండేందుకు వాహనాదారులు మీ సేవ కేంద్రాలు, పేటీఎంలోని ఈ చలాన్ ద్వారా రాయితీలు చెల్లించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News