బైక్ కొనిస్తేనే తాళి కడతా.. బీష్మించిన వరుడు.. బుజ్జగించిన ఎమ్మెల్యే..
MLA Rasamayi Balakishan: పీటల మీద పెళ్లి ఆగిపోకుండా పెద్ద మనసుతో ఎమ్మెల్యే నగదును సర్దుబాటు చేయడంపై పెళ్లికి వచ్చిన వారందరూ హర్షం వ్యక్తం చేశారు.
బైక్ కొనిస్తేనే తాళి కడతా.. బీష్మించిన వరుడు.. బుజ్జగించిన ఎమ్మెల్యే..
MLA Rasamayi Balakishan: కట్నం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చట్ట రీత్యా నేరం...కానీ ఇప్పటికీ కట్నం లేకుండా పెళ్లిళ్లు జరగడం లేదు. అమ్మాయిల పెళ్లిళ్లు చేసేందుకు కట్న కానుకలు ఇవ్వాల్సిందే. కట్నం ఇవ్వలేదని వరుడు తరపు బంధువులు అర్థాంతరంగా పెళ్లిని రద్దు చేసుకోవడం..లేదంటే పెళ్లి సమయంలో కట్నం కోసం వధువు తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం..ఇలాంటివి పరిపాటిగా మారింది. తాజాగా ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే అంబాల్ పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ, మలయ్య కూతురు అనూషకు వెన్నంపల్లి గ్రామానికి చెందిన వినయ్ తో మే 12న వివాహం నిశ్చయం అయింది. కట్నం కింద వరుడి తల్లిదండ్రులకు రూ.5లక్షలు ఇచ్చారు. అయితే తాళి కట్టేసమయంలో వరుడు బీష్మించుకూర్చున్నాడు. తనకు బైక్ కొనిస్తేనే తాళి కడతానంటూ తెగేసి చెప్పాడు. ముందుగా అనుకోలేదు కదా అని వధువు తల్లిదండ్రులు ప్రశ్నించడంతో పెద్ద రగడ జరిగింది. ఇక ఇదే వివాహానికి అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జరుగుతున్న తంతంగాన్ని అంతా చూస్తూనే ఉన్నారు.
వరుడు ఎక్కడా తగ్గకపోవడంతో ఆయనే మధ్యవర్తిత్వం చేసి వరుడుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతడు ససేమిరా అనేసరికి..పెళ్లికూతురు తరపున తానే బైక్ కొనిస్తానని వరుడుకి హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాకుండా స్పాట్ లో రూ.50వేలు నగదును వరుడి తండ్రికి ఇచ్చారు. మిగిలిన డబ్బులను బైక్ షోరూంకు అందజేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. దీంతో శాంతించిన వరుడు..వధువు మెడలో తాళి కట్టాడు. పీటల మీద పెళ్లి ఆగిపోకుండా పెద్ద మనసుతో ఎమ్మెల్యే నగదును సర్దుబాటు చేయడంపై పెళ్లికి వచ్చిన వారందరూ హర్షం వ్యక్తం చేశారు. పెళ్లికూతురు, ఆమె బంధువులు..ఎమ్మెల్యే రసమయకు రుణపడి ఉంటామంటూ థ్యాంక్స్ చెప్పారు.