వరంగల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు

Update: 2019-08-08 08:22 GMT

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 9 నెలల చిన్నారి రేప్‌, హత్యపై వరంగల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ముద్దాయి ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన 50 రోజుల్లోనే ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు విచారణ పూర్తి చేసింది.

వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలో గత జూన్‌ 19 న తల్లి ఒడిలో నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన ప్రవీణ్‌ అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటన తెలుగురాష్ట్రాల్లో అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కేసు ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు జులై 15 న చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఇప్పటివరకు 12 సార్లు ముద్దాయి ప్రవీణ్‌ను కోర్టుకు హాజరుపర్చారు.

విచారణలో భాగంగా నేరం చేసినట్లు జడ్జీ ముందు ప్రవీణ్ ఒప్పుకున్నాడు. ఆ రోజు హన్మకొండలో బాధితుడి ఇంట్లో చొరబడి సెల్‌ఫోన్‌ను దొంగలించడంతో పాటు చిన్నారిని కూడా ఎత్తెకెళ్లినట్లు చెప్పాడు. అయితే మొదట ఎత్తుకెళ్లిన మాట వాస్తవమే అని కానీ తాగిన మైకంలో ఏం చేశానో గుర్తు లేదని చెప్పాడు. దీంతో కోర్టు విచారణను అరగంట పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత నేరం చేసినట్లు ప్రవీణ్‌ ఒప్పుకోవడంతో న్యాయమూర్తి ప్రవీణ్‌కు ఉరిశిక్ష విదిస్తూ సంచలన తీర్పు వెల్లడించారు.

ఇక ఈ కేసులో ప్రవీణ్‌కు మద్దతుగా ఏ న్యాయవాది కేసు వాదనకు ముందుకు రాలేదు. సున్నితమైన అంశంతో పాటు భావోద్వేగాలతో కూడిన కేసు కావడంతో న్యాయవాదులు ప్రవీణ్‌ పట్ల సహాయ నిరాకరణ చేశారు. దీంతో న్యాయస్థానం ప్రభుత్వం తరపున న్యాయవాదిని నియమించింది.  

Tags:    

Similar News