Nampally Fire Accident: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం: ఫర్నిచర్ దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు.. భవనంలో చిక్కుకున్న ఆరుగురు!
Nampally Fire Accident: హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Nampally Fire Accident: హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రారంభమైన మంటలు నిమిషాల వ్యవధిలోనే పైఅంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాద సమయంలో భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
రంగంలోకి 4 ఫైరింజన్లు:
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
నుమాయిష్ రద్దీ.. భారీగా ట్రాఫిక్ జామ్:
ప్రస్తుతం నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ నడుస్తుండటం, పైగా వీకెండ్ కావడంతో ఈ ప్రాంతంలో జనసంచారం విపరీతంగా ఉంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, షాపింగ్‌కు వచ్చిన వారు భయాందోళనతో పరుగులు తీశారు. దీని ప్రభావంతో నాంపల్లి ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా చూస్తున్నారు.
హైటెన్షన్ వాతావరణం:
భవనం నుండి వస్తున్న దట్టమైన నల్లని పొగలు కిలోమీటరు దూరం వరకు కనిపిస్తున్నాయి. అగ్నిమాపక అధికారులు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఆరుగురు వ్యక్తుల క్షేమ సమాచారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.