మట్టపల్లి ఆలయంలోకి కృష్ణా బ్యాక్ వాటర్
Krishna Water Enters Mattapally Temple : ఎగువన కురిసిన వర్షాలకు వరద నీరు కృష్ణా నదిలో చేరడంతో వరద ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఆలయంలోకి చేరిన వరద నీరు
Krishna Water Enters Mattapally Temple : ఎగువన కురిసిన వర్షాలకు వరద నీరు కృష్ణా నదిలో చేరడంతో వరద ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు రాష్ట్రంలోని ప్రాజెక్టులు, నదులు, వాగులు వంకలు కూడా పొంగి పొరలుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలోనే పులిచింతల ప్రాజెక్టు నీటి స్థాయిలు పెరిగి సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం మట్టపల్లిలో గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రవేశించింది. ఆలయ ప్రహరీగోడకు ఉన్న లీకేజీ నుంచి వరద నీరు ఆలయ ప్రాంగణంలోకి పూర్తిగా ప్రవేశించాయి. కాగా ఆలయ అధికారులు ఆలయంలోకి ప్రవేశించిన నీటిని వెలుపలికి పంపేందుకు మోటారు పంప్‌సెట్లను ఉపయోగిస్తున్నారు.
ఈ ఆయలంలో ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు గత ఏడాది కూడా ఇదే విధంగా ఆలయంలోకి నీరు చేరింది. రాజగోపురం వరకు నీళ్లు చేరుకోవడంతో ఆలయంలోకి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆలయ అర్ఛకులు, అధికారులు రాజగోపురం వద్దే ఐదు రోజులపాటు పూజలు చేయాల్సి వచ్చింది. వరద ప్రవాహాలు కొనసాగుతుండటంతో పులిచింతల ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3,41,433 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 3,18,066 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.
ఇక నాగార్జునసాగర్ లోకి భారీగా చేరిన వరద నీటితో జలాశయం కళకళలాడుతోంది. ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగడంతో అధికారులు ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రాజెక్టుకు సంబంధించిన 16 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇక ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తతం సాగర్ లో ప్రస్తుత నీటిమట్టం 587.50 అడుగులుగా ఉంది. ఇక సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,70,903 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 305.8416 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312. 0405 టీఎంసీలుగా ఉంది. ఇక ప్రస్తుతం అధికారులు 3,37,088 క్యూసెక్కుల నిటీని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు.