నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం... మంత్రివర్గ విస్తరణపై రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2025-03-25 11:00 GMT

Komatireddy Rajagopal Reddy: నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం... మంత్రివర్గ విస్తరణపై రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కేబినెట్ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. . తనకు మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నట్లు చెప్పారు. నేతల కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేస్తారని అన్నారు. తనకున్న శక్తిసామర్ధ్యాల గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని తెలిపారు. కానీ ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిన్న మంగళవారం ఢిల్లీలో తీవ్ర చర్చ జరిగి ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుండి మీకు ఫోన్ వచ్చిందా అని మీడియా ప్రశ్నించగా, తనకు ఇప్పటికైతే ఢిల్లీ నుండి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 3న తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలొస్తున్నాయి. కేబినెట్ విస్తరణ గురించి చర్చించడానికే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధ్యనత సంతరించుకుంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా మంత్రి పదవి విషయంలో తన డిమాండ్‌ను వినిపిస్తూ వస్తున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడంలో సవాళ్లు ఏంటి?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. పైగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీ సామాజికవర్గం నుండి బీర్ల ఐలయ్య, ఎస్టీ సామాజిక వర్గం నుండి బాలూ నాయక్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే రెడ్డి సామాజికవర్గం నుండి మంత్రి పదవి ఆశిస్తున్న వారు ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుండి మల్‌రెడ్డి రంగారెడ్డి వంటి నేతల పేర్లు ఆ జాబితాలో వినిపిస్తున్నాయి.  

ఇలా సామాజిక సమీకరణల ప్రకారం చూసినా, లేదా ఉమ్మడి జిల్లా కోణంలో చూసినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవి వరించడంలో ఇలాంటి సవాళ్లు అడ్డం వస్తున్నాయి. అయితే, రాజగోపాల్ రెడ్డి మాత్రం ఈసారి మంత్రి పదవి వస్తుందనే ఆశలోనే ఉన్నారని ఆయన మాటలు చెబుతున్నాయి. ఏం జరగనుందనేది మంత్రివర్గ విస్తరణపై ఒక అధికారిక ప్రకటన వస్తే కానీ తెలిసే ఛాన్స్ లేదు. 

Tags:    

Similar News