kishan reddy visit tims : హైదరాబాద్‌లో కరోనా టెస్టులు పెంచాలి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Update: 2020-08-01 07:30 GMT

kishan reddy visit tims : హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో వసతులపై, రాష్ట్రంలో కరోనా పరీక్షల్లో నెలకొన్ని పరిస్థితులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న టిమ్స్ ఆస్పత్రిని కిషన్ రెడ్డి సంరద్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో కరోనా బాధితులతో మాట్లాడుతూ వారికి అందుతున్న చికిత్సలు, వారికి కల్పిస్తున్న వసతులపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి వైద్య సిబ్బందితో ఆయన మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ టిమ్స్‌లో వసతులపై అసంతృప్తి వ్యక్తంచేసారు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. టిమ్స్ హాస్పిటల్‌ను మరింత అభివృద్ధి చేసి సదుపాయాలు కల్పించాలని సర్కారుకు సూచించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ వసతులు మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అనుసరించాలన్నారు. రాష్ట్రంలో టెస్టులు ఎంత ఎక్కువగా చేస్తే కరోనాను అంతగా కట్టడి చేయొచ్చని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వం తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నారన్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం మేలుకుని నగరంలోని అన్ని బస్తీల్లోనూ టెస్టులు చేయాలన్నారు. టెస్టు చేయమని ఎవరు అడిగినా చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. హైదరాబాద్ బస్తీల్లో టెస్టుల కోసం తక్కువ సంఖ్యలో టోకెన్లు ఇస్తున్నారన్నారు.

అలాగే నగరంలోని అన్ని ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. హోమ్ ఐసొలేషన్‌లో చికిత్స తీసుకోవాల్సిన పేషెంట్స్ బయట తిరుగుతున్నారని, ప్రభుత్వం వీరిని గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఆగస్టు మాసంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు ఇంటి గడపదాటి బయటకు రావద్దని హితవుపలికారు. వైద్య సిబ్బందికి జీతాలతో పాటు అదనపు ఇన్సెన్టివ్స్ అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కరోనా బారినపడిన వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాలని...ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని కిషన్ రెడ్డి సూచించారు.




Tags:    

Similar News