ఆడపిల్ల పుట్టిన ఇంటికి స్వీట్స్‌తో వెళ్లి సెలబ్రేట్ చేయండి.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
Khammam collector Muzammil Khan: జిల్లా కలెక్టర్‌గా ముజమ్మిల్ ఖాన్ తీసుకున్న గళ్ ప్రైడ్ నిర్ణయం నిజంగా మనస్పూర్తిగా...
ఆడపిల్ల పుట్టిన ఇంటికి స్వీట్స్‌తో వెళ్లి సెలబ్రేట్ చేయండి.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
IAS Muzammil Khan's initiative to save girl child: సమాజంలో ఆడపిల్లల పట్ల ఎలాంటి లింగ వివక్షత ఉండకూడదు అని కోరుకునే ప్రభుత్వాలే కాదు... అంత పెద్ద మనసున్న ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. "పుడితే కొడుకే పుట్టాలి... ఆడపిల్ల అసలే వద్దు అనే రోజుల నుండి పుడితే ఆడపిల్లే పుట్టాలి" అని కోరుకునే రోజుల్లోకి వచ్చాం. అయినప్పటికీ సమాజంలో ఇంకా ఎక్కడో ఒక చోట బంగారు తల్లులు వివక్షకు గురవుతూనే ఉన్నారు. అందుకే ఆ వివక్షతను దూరం చేసేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 'గళ్ ప్రైడ్' పేరుతో మరో సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
గళ్ ప్రైడ్ లక్ష్యం ఏంటి?
గళ్ ప్రైడ్ లక్ష్యం ఏంటంటే... తమ జిల్లాలో ఏ కుటుంబంలో అయితే ఆడపిల్ల పుడుతుందో, స్థానిక అధికారులు ఆ ఇంటికి స్వీట్స్ తీసుకువెళ్లి వారిని అభినందించాలి. ఆడపిల్ల కూడా తక్కువేం కాదు... వారు కూడా అన్నిరంగాల్లోనూ రాణిస్తూ ఎంతో గొప్ప స్థాయిలో కొనసాగుతున్నారని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకాదు... మగపిల్లలతో సమానంగా వారిని చదివించాలి, అన్నింటా అవకాశం కల్పించాలని సూచించాలి. ఆ కుటుంబానికి స్వీట్స్ పంచి ఆ ఇంట్లో పండగ వాతావరణం తీసుకురావాలి. జిల్లా కలెక్టర్‌గా అధికారులకు ఇది ముజమ్మిల్ ఖాన్ ఆదేశం.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జిల్లా అధికారులతో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గళ్ ప్రైడ్ కార్యక్రమం లక్ష్యాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పారు. ఆడపిల్లలను గౌరవించే సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. వచ్చే వారం నుండి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ గళ్ ప్రైడ్ కార్యక్రమం అమలు కానుంది.
తాత ఐఏఎస్, తండ్రి ఐపిఎస్.. ఇంతకీ ముజమ్మిల్ ఖాన్ ఎవరో తెలుసా?
ముజమ్మిల్ ఖాన్... మూడు తరాలుగా సివిల్స్ నేపథ్యం ఉన్న కుటుంబం అది. తాత అబ్ధుల్ కరీం ఖాన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. తండ్రి అబ్ధుల్ ఖయ్యుం ఖాన్ ఒక రిటైర్డ్ ఐపిఎస్ అధికారి. అబ్ధుల్ ఖయ్యుం ఖాన్‌గా కంటే సింపుల్‌గా ఏ.కే. ఖాన్‌గానే ఆయన అందరికీ సుపరిచితం. గత తెలంగాణ ప్రభుత్వంలో ఏ.కే. ఖాన్ అనేక కీలక హోదాల్లో పనిచేశారు. రిటైర్మెంట్ అనంతరం తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు అడ్వైజర్‌గానూ సేవలు అందించారు.
తండ్రి అబ్ధుల్ ఖయ్యుమ్ ఖాన్ రిటైర్మెంట్ తరువాత ముజమ్మిల్ ఖాన్ సివిల్స్‌కు ఎంపికయ్యారు. 2017 లో ఆల్ ఇండియాలో 22వ ర్యాంక్ సొంతం చేసుకున్న ముజమ్మిల్ ఖాన్.. తెలంగాణ నుండి తనే టాపర్‌గా నిలిచారు.
ఇటీవల ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సందర్శనకు వెళ్లిన ముజమ్మిల్ ఖాన్... అధికారిని అనే బింకాన్ని పక్కనపెట్టి నేలపైనే కూర్చుని విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. పంట పొలాల మధ్యలోకి వెళ్లి రైతుల కష్టసుఖాలు ఆరా తీసిన తీరు కూడా హైలైట్ అయింది. మళ్లీ ఇప్పుడిలా గళ్ ప్రైడ్‌తో ఆయన మరోసారి వార్తల్లోకొచ్చారు.
ఆడపిల్లల అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం జిల్లా కలెక్టర్‌గా ముజమ్మిల్ ఖాన్ తీసుకున్న గళ్ ప్రైడ్ నిర్ణయం నిజంగా మనస్పూర్తిగా అభినందించదగిన విషయం కదా!!