సెప్టెంబరు ఆరు నుంచి గ్రామబాట

గ్రామాల్లో అమలుచేయాల్సిన 60 రోజుల ప్రణాళికలో భాగంగా మొదటిదశలో 30 రోజుల ప్రణాళికను సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్.

Update: 2019-08-31 00:57 GMT

గ్రామాల్లో అమలుచేయాల్సిన 60 రోజుల ప్రణాళికలో భాగంగా మొదటిదశలో 30 రోజుల ప్రణాళికను సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై మార్గదర్శనం చేసేందుకు రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో సెప్టెంబర్ 3న విస్తృతస్థాయి సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. గ్రామాల్లో అతితక్కువ వేతనాలతో పనిచేస్తున్న సఫాయీ కర్మచారులకు సీఎం శుభవార్త చెప్పారు. వారి వేతనాలను 8,500కు పెంచుతున్నట్టు ప్రకటించారు. పంచాయతీరాజ్‌శాఖలో అన్ని ఖాళీలను భర్తీచేయడంతోపాటు, కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జతచేసి నెలకు 339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదలచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అమలుచేయాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ పలువురు మంత్రులు, కలెక్టర్లు, డీపీవోలు, ఉన్నతాధికారులతో ఏడుగంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు.

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు పర్యవేక్షణకు గ్రామానికి ఒకరు చొప్పున మండలస్థాయి అధికారులను ఇంచార్జులుగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు కేసీఆర్. మండల, జిల్లా పరిషత్తులను క్రియాశీలకంగా మార్చేందుకు అవసరమైన సిఫారసులను కలెక్టర్ల నుంచి స్వీకరించి, నిబంధనలు రూపొందించాలని నిర్ణయించారు. పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియాలని, ప్రణాళికాపద్ధతిలో గ్రామాల అభివృద్ధి, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం జరుగాలని, మొత్తంగా విస్తృత ప్రజాభాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ బృహత్తర లక్ష్యం నెరవేర్చడానికి అవసరమైన ఒరవడికి 30 రోజుల కార్యాచరణ నాంది పలుకాలని ఆకాంక్షించారు. మొదట 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలని భావించినప్పటికీ.. అధికారుల సూచనమేరకు మొదటిదశలో 30 రోజులపాటు నిర్వహించి, మరో దశ కొనసాగించాలని నిర్ణయించారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించినట్టు సీఎం వెల్లడించారు. 

Tags:    

Similar News