Karimnagar: వలపు వల.. వందమంది బలి! కరీంనగర్‌లో దంపతుల కిలేడీ వేషాలు.. వీడియోలతో కోట్లు వసూలు

Karimnagar Honey Trap Scandal: కరీంనగర్‌లో దారుణం.. సోషల్ మీడియా ద్వారా అమాయక పురుషులను బుట్టలో వేసుకుని, వారితో గడిపిన వీడియోలను రహస్యంగా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2026-01-15 02:30 GMT

Karimnagar: వలపు వల.. వందమంది బలి! కరీంనగర్‌లో దంపతుల కిలేడీ వేషాలు.. వీడియోలతో కోట్లు వసూలు

Karimnagar: అప్పులు తీర్చుకోవడానికి అడ్డదారి తొక్కిన ఓ దంపతుల ముఠా ఉదంతం కరీంనగర్‌లో కలకలం రేపింది. సామాజిక మాధ్యమాల వేదికగా 'హనీ ట్రాప్' (వలపు వల) వేసి, వంద మందికి పైగా వ్యాపారులు, యువకులను బ్లాక్‌మెయిల్ చేసిన భార్యాభర్తలను కరీంనగర్ రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

కేసు వివరాలు: మంచిర్యాల జిల్లాకు చెందిన సదరు వ్యక్తి కరీంనగర్‌లో మార్బుల్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. వ్యాపారంలో నష్టం రావడం, ఇంటీరియర్ డెకరేషన్ కోసం తీసుకున్న బ్యాంకు లోన్ ఈఎంఐలు భారమవ్వడంతో.. సులభంగా డబ్బు సంపాదించేందుకు భార్యతో కలిసి నేర బాట పట్టాడు.

నేరం సాగిందిలా:

సోషల్ మీడియా వేట: మూడేళ్ల కిందట ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో యువకులను ఆకర్షించేలా తన భార్య ఫోటోలు, ఫోన్ నంబర్లతో పోస్టులు పెట్టేవాడు.

రహస్య కెమెరాలు: ఆ పోస్టులు చూసి ఫోన్ చేసిన వారితో తన భార్య గడిపేలా ఏర్పాటు చేసేవాడు. ఆ సమయంలో అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో రహస్యంగా వీడియోలను చిత్రీకరించేవాడు.

బ్లాక్‌మెయిల్: గడిపిన తర్వాత ఆ వీడియోలను బాధితులకు పంపి.. "డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు చూపిస్తాం, సోషల్ మీడియాలో పెడతాం" అంటూ బెదిరింపులకు దిగేవారు. ఇలా మూడేళ్లలో సుమారు 100 మందిని బెదిరించి అందినకాడికి దండుకున్నారు.

వ్యాపారి ఫిర్యాదుతో వెలుగులోకి.. ఏడాది కిందట ఈ వలలో చిక్కిన ఓ స్థానిక వ్యాపారి నుంచి ఈ దంపతులు ఏకంగా రూ. 13 లక్షలు వసూలు చేశారు. అంతటితో ఆగకుండా మరో రూ. 5 లక్షలు కావాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. బాధితుడు భయపడి మరో రూ. లక్ష ఇచ్చినా వేధింపులు తగ్గకపోవడంతో.. చివరకు ధైర్యం చేసి కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసుల యాక్షన్: కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిందితులను అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి కీలక ఆధారాలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల హెచ్చరిక: సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులు చేసే ఆకర్షణీయమైన పోస్టులను నమ్మి మోసపోవద్దని, ఇలాంటి వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News