కొనసాగుతున్న జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 31.94 శాతం పోలింగ్ నమోదు
జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ స్టార్ట్ కాగా..తొలుత పోలింగ్ కేంద్రాల వద్ద కొంత రద్దీ కనిపించింది.
జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ స్టార్ట్ కాగా..తొలుత పోలింగ్ కేంద్రాల వద్ద కొంత రద్దీ కనిపించింది. ఐతే ఆ తర్వాత నుంచి పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 31.94 శాతం పోలింగ్ నమోదయ్యింది. చివరి రెండు గంటల్లో సాయంత్రం 4 నుంచి 6 వరకు పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
ఎన్నికలకు హైదరాబాద్ నగరంలో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపరనే ఆపవాదు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలో 50శాతం కంటే తక్కువ పోలింగ్ నమోంది. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్‌లో అయినా ఓటర్లు కదిలివస్తారా..? గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ శాతాన్ని చూస్తే.. ఉదయం 9గంటల వరకు 10.02 శాతం పోలింగ్ నమోదైంది. అంటే తొలి గంటలో.. వందకు పది మంది మాత్రమే ఓటు వేశారు. ఇక ఉదయం 11గంటల వరకు 20.76, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94శాతం పోలింగ్ నమోంది.
ప్రస్తుతానికి అయితే పోలింగ్ మందకొడిగా సాగుతున్నట్టు తెలుస్తోంది. కాస్త ఎండ తగ్గాక.. మెల్ల మెల్లగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. కనీనం ఈసారైనా నగర ఓటర్ల చైతన్యం పెరుగుతుందా..? పోలింగ్ 50శాతం దాటుతుందా అన్న ఆసక్తి కలుగుతోంది.
మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్కేంద్రాల వద్ద సీఐఎస్ఎఫ్బలగాలను మోహరించగా.. 1,761 మంది పోలీసులు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు.