ఆసిఫాబాద్ జిల్లాలో జంగుబాయి జాతర

* ఘనంగా ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి జాతర * జంగుబాయి జాతరకు తండోపతండాలుగా తరలివస్తున్న ఆదివాసీలు

Update: 2021-01-30 09:58 GMT

Janubhai Jathara in Asifabad District

చుట్టూ దట్టమైన అరణ్యం కొండకోనల మధ్య ఓ పుణ్యక్షేత్రం. గుహలో కొలువైన ఆ క్షేత్రానికి దేశ నలుమూలల నుంచి గిరిపుత్రులు కదిలివస్తున్నారు. అడవి తల్లి నీడలో తర తరాలుగా జీవనం సాంగించే ఆదివాసీలు కొండకోనల్లో కొలువైన జంగుబాయి జాతరకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇంతకీ జంగుబాయి జాతర ఏంటీ. ఎన్నిరోజుల పాటు ఈ జాతర జరుగుతుంతో ఇప్పుడు చూద్దాం.

విలువైన సంప్రదాయాలు కట్టుబాట్లతో జీవనం విలక్షణమైన ఆహార్యం అడవి నీడలో తర తరాల పయనం వారే ఆదివాసీలు వారేకాదు వారి పండుగ‌లు, జాతరలు కూడా భిన్నంగా ఉంటాయి. ఏడాది పొడవునా వారు జరుపుకునే పండుగలు, వేడుకల్లో వారి సంస్కృతి ప్రతిబింబిస్తుంది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి జాతర ప్రారంభమైంది. ప్రకృతిని పూజించే ఆదివాసీలు కొండకోనల్లో కొలువైన జంగుబాయి జాతరకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో జంగుబాయి ఆలయం జనసందోహంగా మారింది. జంగుబాయి దేవత... కెరమెరి మండలం ముకదం గూడ గ్రామపంచాయతీ పరిధిలోని మహారాజ్ గూడ అటవీ ప్రాంతం గుహలో కొలువై ఉంటుంది. పూర్తిగా గుహ కావడంతో భక్తులు ఈ గుహలో కూర్చుని నడుస్తారు. చిమ్మచీకటిలో దీపం వెలుతురులో కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా దేవత దర్శనం ఇస్తుంది.

జంగు బాయి జాతర ప్రతీ సంవత్సరం పుష్యమాసంలో నెలవంక కనిపించినప్పుడు ప్రారంభమై అమావాస్య వరకు కొనసాగుతుంది. ఈ జాతరకు వచ్చే ఆదివాసి భక్తులు నియమనిష్టలతో పాదరక్షలు కూడా ధరించకుండా కాలినడకన ప్రయాణం చేస్తారు. నెల రోజుల పాటు కటిక నేలపైనే పడుకుంటారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగుబాయి వారసులు వేలాదిగా ఒకే వేదికపై మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వచ్చే భక్తులు దారి మధ్యలో ఉన్నటువంటి టోప్లకస్ అనే ప్రాంతం వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలోనే జంగుబాయి అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తారు. సంప్రదాయ వాయిద్యాలతో గుహ లోపలికి వెళ్ళి, జంగుబాయి అమ్మవారిని దర్శించుకుంటారు. తదనంతరం రాత్రి భోజనాలు చేసి, సంప్రదాయ నృత్యాలు చేస్తారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జంగుబాయి ఉత్సవాలకుకు 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తుంది. అలాగే సుదూర ప్రాంతాల నుండి వచ్చే ఆదివాసీ భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆసిఫాబాదు శాసనసభ సభ్యులు ఆత్రం సక్కు అన్నారు.

మొత్తంగా ఆదివాసీలు తమ కట్టు, బొట్టూ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటు భావి తరాలకు అందిస్తున్నారు. వేడుకలతో సరిపెట్టకుండా ఆదివాసీల సంక్షేమంపై దృష్టి సారిస్తే వారి జీవితాల్లో వెలుగులు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Tags:    

Similar News