వనమా, జలగం మధ్య అగ్గిరాజేసిన అక్షయపాత్రేంటి?

Update: 2019-06-21 13:59 GMT

ఆ నాయకుడు అక్కడ ఆల్రెడి టెంటు వేశాడు. మరో లీడరు అదే టెంటులోకే వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మంట పుట్టింది. బద్ద శత్రువులుగా కొట్టుకున్నవారే, ఇప్పడు ఒకే గూడు కింద చేరడంతో, వారిలో ఒకరి ఉనికే ప్రశ్నార్థకమైంది. ఇంతలో ఒక అక్షయపాత్ర, ఇద్దరి మధ్యా ప్రత్యక్ష యుద్ధాన్ని రగిలించింది. ఖమ్మం జిల్లాలో ఇద్దరు బడా నాయకుల మధ్య కోల్డ్‌వార్‌, సెగ్మెంట్‌లో మంటలు పుట్టిస్తోంది. తాజాగా వీరి మధ్య ఫైర్‌ రగిలించడంలో అక్షయపాత్ర, పాత్రెంత?

జలగం వెంకట్రావు. భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార పార్టీకి పెద్దదిక్కు. వనమా వెంకటేశ్వర రావు. గులాబీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్‌ నేత. ఇప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే కాదు, వేయకున్నా భగ్గుమనేలా సిచ్యువేషన్ ఉంది. ఎందుకింతగా వీరిమధ్య వైరం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చక్రం తిప్పారు జలగం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించనివిధంగా ఓటమిపాలయ్యారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ కాంగ్రెస్ నేత వనమా వెంకటేశ్వరరావు, అనంతర పరిణామాల్లో అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. వనమా ఆయన అనుచరగణం టిఆర్ఎస్‌లో చేరిన నాటి నుంచి నిన్నటి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ వనమా, జలగం వర్గాల మధ్య ప్రచ్చన్నయుద్ధం ఓస్థాయిలో సాగుతోంది. చివరికి పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల బి.ఫారాలు ఇచ్చే విషయంలోనూ, తమకు అన్యాయం జరిగిందని జలగం వర్గం రగిలిపోతోంది. పుండు మీద కారం చల్లినట్టుగా, తాజాగా అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న మధ్యాహ్న బోజన పథకాన్ని నిలిపివేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, జలగం వెంకట్రావుకు అస్సలు మింగుడుపడటం లేదు.

వాస్తవానికి 2017 నవంబర్‌లో అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అయితే, అక్షయ పాత్ర ద్వారా అందిస్తున్న ఆహార పదార్ధాలు పిల్లలు తినలేని స్థితిలో ఉన్నాయని, రుచిగాలేని కారణంగా వారు తిరస్కరిస్తున్నారంటూ, వామపక్ష పార్టీలు అప్పట్లో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించాయి. మధ్యాహ్న భోజన పథకం అమలును తిరిగి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కొనసాగించాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. కాని ఇపుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంలో స్వయం సహాయక సంఘాలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చిన వనమా, ఎమ్మెల్యే గా గెలిచారు. తాను ఇచ్చిన మాట ప్రకారం అక్షయ పాత్ర ఫౌండేషన్ కొనసాగకుండా చక్రం తిప్పారు. దీనిని అడ్డుకునేందుకు జలగం వెంకట్రావ్ ఆఖరిదాకా ప్రయత్నించి విఫలమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాటే నెగ్గింది. అదే వనమా, జలగం మధ్య మరింత అగ్గిరాజేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులతోనే మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ టి.విజయ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలు మినహాయించి మిగిలిన అన్ని మండలాల్లో స్వయం సహాయక గ్రూపు సభ్యులే పగటి భోజనం వండి వడ్డిస్తున్నారు. కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్‌ మండలాల్లోని పాఠశాలల్లోనే అక్షయప్రాత ఫౌండేషన్‌ భోజనం సరఫరా చేస్తోంది. కాగా ఇటీవల వారి కాంట్రాక్ట్‌ అయిపోవడం, అక్షయపాత్ర సరఫరా చేసే భోజనంపై ఆరోపణలు రావడంతోపాటు, ఎమ్మెల్యే వనమా ఫిర్యాదుతో ఐదుగురు అధికారులతో కమిటీ వేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి స్వయం సహాయక గ్రూప్ సభ్యులతోనే భోజనం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అక్షయప్రాత ఫౌండేషన్‌కు మగళం పాడినట్లైంది. చివరి నిమిషం వరకూ వనమా వెంకటేశ్వరరావు-జలగం వెంకట్రావ్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన అక్షయ పాత్ర ఫౌండేషన్ వివాదంలో, వనమా విజయం సాధించడంతో జలగం వెంకట్రావ్ వర్గం మండిపోతోంది. నియోజకవర్గంలో వనమా పట్టు పెరుగుతూపోతే, తన ఉనికే ప్రశ్నార్థకమయ్యేలా ఉందని మధనపడుతున్నారు జలగం వర్గీయులు. ఇద్దరూ కలిసి పని చేయాలని గులాబీ అధిష్టానం సర్ది చెబుతున్నా, ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ కంటిన్యూ అవుతోంది.

Tags:    

Similar News