లెక్చరర్లు తిట్టారని మనస్తాపం.. బ్రెయిన్ హెమరేజ్‌తో ఇంటర్ విద్యార్థిని మృతి!
కళాశాలలో లెక్చరర్లు అందరిముందు అవమానించారనే మనస్తాపంతో ఓ ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థిని (17) ప్రాణాలు కోల్పోయింది.
కళాశాలలో లెక్చరర్లు అందరిముందు అవమానించారనే మనస్తాపంతో ఓ ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థిని (17) ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టి (Brain Hemorrhage) ఆ బాలిక మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
వెస్ట్ మారేడుపల్లికి చెందిన సదరు విద్యార్థిని ఎంఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదువుతోంది. గురువారం కళాశాలకు గంట ఆలస్యంగా వెళ్లడంతో, ఫిజిక్స్ లెక్చరర్ శ్రీలక్ష్మి, ఇంగ్లీష్ లెక్చరర్ మాధురిలు విద్యార్థులందరి ముందు ఆమెను అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో తీవ్ర అవమానానికి గురైన బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన తల్లికి విషయం చెప్పింది. తల్లి ఆమెను సముదాయించే ప్రయత్నం చేసింది.
తీవ్ర మనస్తాపంతో కుప్పకూలిన బాలిక:
తల్లితో మాట్లాడుతుండగానే బాలికకు ఒక్కసారిగా తలనొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మల్కాజిగిరి ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ఎడమ చేయి, కాలు పక్షవాతం వచ్చినట్లుగా పడిపోయాయి. సిటీ స్కాన్ చేసిన వైద్యులు.. బాలిక తీవ్రమైన మానసిక ఒత్తిడికి (Extreme Mental Stress) గురవ్వడం వల్ల మెదడులో రక్తం గడ్డకట్టిందని నిర్ధారించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆమె కన్నుమూసింది.
కళాశాల ముందు ధర్నా.. నిందితులపై చర్యలకు డిమాండ్:
శుక్రవారం ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు, ఎమ్మార్పీఎస్ నేతలు మరియు ఓయూ విద్యార్థి సంఘాలు కళాశాల ముందు భారీ ధర్నా చేపట్టారు. బాధ్యులైన లెక్చరర్లు మరియు కళాశాల ప్రిన్సిపల్‌పై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.