Metpally: చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలు.. బాలుడికి 20 కుట్లు
Chinese Manja: నిషేధిత చైనా మాంజా మరోసారి ప్రాణాంతకంగా మారింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బవాడలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో శ్రీహస్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Chinese Manja: నిషేధిత చైనా మాంజా మరోసారి ప్రాణాంతకంగా మారింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బవాడలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో శ్రీహస్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీహస్ గురువారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఎక్కడో తెగివచ్చిన చైనా మాంజా ఒక్కసారిగా బాలుడి మెడకు చుట్టుకుంది. దారం గట్టిగా ఉండటంతో బాలుడి మెడ భాగం లోతుగా కోసుకుపోయింది.
బాలుడి ఆర్తనాదాలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, అతడిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి మెడ చుట్టూ సుమారు 20 కుట్లు వేసినట్లు సమాచారం. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేయడానికి చైనా మాంజాను వాడటం ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు వీటిని విక్రయిస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. చైనా మాంజా వాడకం వల్ల పక్షులకే కాకుండా మనుషులకు, ముఖ్యంగా వాహనదారులకు మరియు ఆడుకునే పిల్లలకు ప్రాణాపాయం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.