TS SSC Exams 2021: పదవ తరగతి పరీక్షలో కీలక మార్పులు, ఆరు పేపర్లలోనే పరీక్ష...

TS SSC Exams 2021: *పరీక్ష సమయాన్ని అరగంటపాటు పెంపు *జీవో విడుదల చేసిన విద్యాశాఖ

Update: 2021-10-12 03:13 GMT

TS SSC Exams 2021: పదవ తరగతి పరీక్షలో కీలక మార్పులు, ఆరు పేపర్లలోనే పరీక్ష...

TS SSC Exams 2021: తెలంగాణలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లే ఉండనున్నాయి. ఇప్పటివరకు హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు రెండు చొప్పున పరీక్షలు నిర్వహించగా.. ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒక్క పేపర్‌ మాత్రమే నిర్వహించనున్నారు. దీంతోపాటు పరీక్ష సమయాన్ని అరగంట పాటు పెంచారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గత ఏడాది లాక్‌డౌన్‌ సమయం నుంచే పాఠశాలల మూసివేతతో విద్యార్థులకు బోధన సరిగా జరగలేదు. దీంతో పదో తరగతిలో ఆరు పరీక్షలే నిర్వహించాలని గత ఏడాదే నిర్ణయించారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్స్‌ మార్కుల ఆధారంగా అందరినీ పాస్‌ చేశారు. ఈ ఏడాది మొదట్లోనూ అదే తరహా పరిస్థితి ఎదురైంది.

ఈ ఏడాది కూడా విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందని పరిస్థితి ఉందని, పదో తరగతికి ఆరు పేపర్లే పెట్టాలని స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సిఫారసు చేసింది. దీనిని పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ, 2021-22 ఏడాదికి సంబంధించి టెన్త్‌ పరీక్షలను కుదిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 1971లో ఎస్ఎస్‌సీ బోర్డు ఏర్పాటు కాగా.. అప్పట్నుంచీ 11 పేపర్ల విధానమే కొనసాగుతోంది.

కొన్నేళ్ల కింద పరీక్షల విధానాన్ని మార్చారు. పబ్లిక్‌ పరీక్షల ద్వారా విద్యార్థికి ఇచ్చే మార్కులను ఒక్కో సబ్జెక్టులో గరిష్టంగా 80కి పరిమితం చేశారు. మిగతా 20 మార్కులను ఇంటర్నల్స్‌ ద్వారా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా ఇదే విధానం కొనసాగనుంది. రెండు పేపర్లలో గతంలో ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చారో.. అదే తరహాలో ఇప్పుడూ క్వశ్చన్ల శాతాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News