Iftar party: ఎల్బీ స్టేడియంలో సీఎం స్టేట్ ఇఫ్తార్ విందు.. రూ. 70 కోట్ల ఖర్చుపై పలు అభ్యంతరాలు

Update: 2025-03-24 16:00 GMT

Iftar party: ఎల్బీ స్టేడియంలో సీఎం స్టేట్ ఇఫ్తార్ విందు.. రూ. 70 కోట్ల ఖర్చుపై పలు అభ్యంతరాలు

Iftar party 2025 in Hyderabad: తెలంగాణ ప్రభుత్వం రేపు మంగళవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తరుపున సీఎ రేవంత్ రెడ్డి ఇస్తోన్న ఈ ఇఫ్తార్ విందు కోసం రాష్ట్ర ఖజానా నుండి రూ. 70 కోట్లు వెచ్చిస్తున్నారు. అయితే, ఈ స్థాయిలో నిధుల కేటాయింపుపై కొంతమంది సామాజికవేత్తలతో పాటు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా (WPI) అభ్యంతరాలు చెబుతున్నట్లు సియాసత్ డైలీ వెల్లడించింది. ఆ నిధులను మైనారిటీల విద్య అవకాశాల పెంపు కోసం, మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం మళ్లిస్తే బాగుంటుందని వారు సూచిస్తున్నారని ఆ కథనం పేర్కొంది.

ఇఫ్తార్ విందు నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

అభ్యంతరాల సంగతి ఇలా ఉంటే, సాయంత్రం ఇఫ్తార్ విందు నేపథ్యంలో హైరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

ఏఆర్ పెట్రోల్ పంపు నుండి బీజేఆర్ స్టాట్యూ వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు డైవర్ట్ చేయనున్నారు.

బషీర్‌బాగ్ నుండి బీజేఆర్ విగ్రహం మీదుగా ఏ.ఆర్. పెట్రోల్ పంపు వైపు వెళ్లే వాహనాలను ఆబిడ్స్ ఎస్బీహెచ్ , నాంపల్లి స్టేషన్ మార్గాల్లో మళ్లిస్తారు.

సుజాత స్కూల్ గల్లీ నుండి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వెళ్లే వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ నుండే నాంపల్లి వైపు డైవర్ట్ చేస్తారు.

వాహనదారులు పంజగుట్ట, వీవీ స్టాచ్యూ, రాజీవ్ గాంధీ స్టాచ్యూ, నిరంకరి, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్, లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు జంక్షన్, బషీర్‌బాగ్, బీజేఆర్ స్టాచ్యూ, ఎస్బీఐ గన్ ఫౌండ్రీ, ఆబిడ్స్ సర్కిల్, ఏ.ఆర్. పెట్రోల్ పంప్, నాంపల్లి, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, మొజం జహీ మార్కెట్, హైదర్ గూడ, అసెంబ్లీ పరిసరాల వైపు రాకుండా వెళ్తే ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉంటారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ అడ్వైజరీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం సోషల్ మీడియాలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసే అప్ డేట్స్ గమనించాల్సిందిగా సూచించారు. అత్యవసర సమయాల్లో 9010203626 హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.    

More interesting articles: మరిన్ని ఆసక్తికరమైన వార్తా కథనాలు

Tags:    

Similar News