Hyderabad: రిఫ్రిజిరేటర్ పేలడంతో అగ్ని ప్రమాదం.. మసిబొగ్గుగా మారిన ఇల్లు!
హైదరాబాద్ నగరంలో గురువారం ఉదయం తీవ్ర అగ్ని ప్రమాదం జరిగింది. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది.
Hyderabad: రిఫ్రిజిరేటర్ పేలడంతో అగ్ని ప్రమాదం.. మసిబొగ్గుగా మారిన ఇల్లు!
Hyderabad: హైదరాబాద్ నగరంలో గురువారం ఉదయం తీవ్ర అగ్ని ప్రమాదం జరిగింది. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. స్థానికుడు సత్యనారాయణ ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ అకస్మాత్తుగా పేలిపోయింది. పేలుడు ధాటికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా వ్యాపించిన మంటల్లో ఇంట్లోని మొత్తం సామగ్రి పూర్తిగా కాలిపోయింది.
పొగలు వచ్చేందుకు గమనించిన పొరుగువారు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఇంటి అంతా మంటల్లో కాలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తనసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. రిఫ్రిజిరేటర్, గ్యాస్ సిలిండర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇటీవలి కాలంలో నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాల నేపథ్యంలో ఈ ఘటన మళ్లీ జాగ్రత్తలపై ప్రశ్నలు వేస్తోంది. ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించే సమయాల్లో అప్రమత్తంగా ఉండటం ఎంత అవసరమో ఈ ఘటన మరొక్కసారి చాటిచెప్పింది.