Hyderabad: మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం కోసం భారీగా తరలివచ్చిన జనం..!

హైదరాబాద్‌లో మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు. నాంపల్లిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేలాది మంది ఆస్థమా బాధితులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Update: 2025-06-09 05:18 GMT

Hyderabad: మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం కోసం భారీగా తరలివచ్చిన జనసందోహం

Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు ప్రసిద్ధమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆయన స్వయంగా చేప ప్రసాదం స్వీకరించడమే కాక, ప్రజలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సంవత్సరం చేప ప్రసాదం కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 42 క్యూ లైన్లను ఏర్పాటు చేయగా, ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో లక్షకు పైగా చేపలను సిద్ధం చేశారు. బత్తినీ కుటుంబ సభ్యులు ఈ ప్రసాదాన్ని 48 గంటలపాటు నిరంతరంగా పంపిణీ చేయనున్నారు. తెలుగురాష్ట్రాలే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.

ఆస్తమా, ఉబ్బసం, దగ్గు, దమ్ము లాంటి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని నమ్మకంతో వేలాది మంది బాధితులు ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. బత్తిని సోదరులు ఏళ్ల తరబడి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ లక్షలాది మందికి ఉపశమనం అందించారని మంత్రి పొన్నం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వారిని గౌరవించాలని ఆయన సూచించారు.

చేప ప్రసాదం పంపిణీని హర్యానా గవర్నర్ బండారూ దత్తాత్రేయ కూడా పరిశీలించారు. రాబోయే సోమవారం ఉదయం 9 గంటల వరకు ఈ పంపిణీ కొనసాగనుంది.

ఈ కార్యక్రమానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 140 బస్సులను నడుపుతోంది. అయితే ఈ క్రమంలో, మెదక్‌ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు క్యూ లైన్‌లో ఉన్నప్పుడు హఠాత్తుగా మృతిచెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.

ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు, అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News