తహసీల్దార్ సహా 10 మంది అధికారులు డ్యూటీకి డుమ్మా... అప్పుడే సడెన్ ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన కలెక్టర్
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ మంగళవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సడన్ ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లారు.
Hyderabad collector Anudeep Durishetty: తహసీల్దార్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేసి సడెన్ షాక్ ఇద్దామని జిల్లా కలెక్టర్ అనుకున్నారు. తీరా అక్కడికి వెళ్లి సిబ్బంది తీరు చూసి ఆయనే షాక్ తిన్నారు. డెక్కన్ క్రానికల్ కథనం ప్రకారం సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీసులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ మంగళవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సడన్ ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లారు. తహసీల్దార్‌ను కలిసి అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారు చాలా మంది కార్యాలయం బయట తహసీల్దార్ కోసం వేచి చూస్తున్నారు. కానీ ఆఫీసులో తహసీల్దార్ పాండు నాయక్ మాత్రం లేరు. అంతేకాదు మొత్తం 10 మంది సిబ్బంది పై అధికారుల అనుమతి లేకుండానే డ్యూటీకి డుమ్మా కొట్టారు.
తహసీల్దార్ సహా ఏ ఒక్కరూ కూడా పర్మిషన్ లేకుండా డ్యూటీకి డుమ్మా కొట్టడం చూసి కలెక్టరే ఖంగు తిన్నారు. ఆ 10 వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మీ పై క్రమశిక్షణారాహిత్యం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన తర్వాత 3 రోజుల్లోగా వివరణ ఇవ్వని పక్షంలో, మీరు చెప్పడానికి ఏమీ లేదని, నిర్లక్ష్య వైఖరితోనే తప్పు చేశారని భావించాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
నోటీసులు అందుకున్న వారిలో తహసీల్దార్ పాండు నాయక్, సర్వేయర్ కె కిరణ్ కుమార్, అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసన్న లక్ష్మి, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బి. జె. పాల్, షేక్ మొహియుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ జి అనూష, ముగ్గురు రికార్డు అసిస్టెంట్స్ మినేష్, రాజశేఖర్, ప్రమోద్, ఆఫీస్ సబార్డినేట్ మాలతి, మరో ఉద్యోగి సతీష్ ఉన్నారు.
కలెక్టర్ ఆఫీసుకు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేస్తున్నారని తెలుసుకున్న తహశీల్దార్ సహా మిగతా సిబ్బంది ఆగమేఘాలపై ఆఫీసుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ముందు రోజు ఆఫీసు డ్యూటీలో ఆలస్యం అవడం వల్ల ఇవాళ ఆఫీసుకు రావడంలో ఆలస్యం జరిగిందని తహశీల్దార్ మౌఖికంగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. కానీ ఆ వివరణపై సంతృప్తి చెందని కలెక్టర్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
సర్వీస్ రూల్స్ నిబంధనల ప్రకారం అనధికారికంగా సెలవులో వెళ్ళడం అంటే ప్రజా సేవలకు విఘాతం కలిగించడమే అవుతుందంటూ అధికారుల తీరుపై కలెక్టర్ అనుదీప్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో తహసీల్దార్ ఆఫీసులో అధికారుల అసలు బాగోతం బయటపడింది. "ఈ తహసీల్దార్ ఇలా ఎన్ని రోజులుగా చేస్తున్నారో ఏమో!!" అని ఈ విషయం తెలిసిన జనం అనుకుంటున్నారు.