Hyderabad City Buses : హైదరాబాద్‌లో రేపటి నుంచి సిటీ బస్సులు

Update: 2020-09-24 13:07 GMT

Hyderabad City Buses : కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆర్టీసీ బస్సులు కూడా మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే గత ఆరు నెలలుగా డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడడంతో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం, అలాగే జిల్లాల్లో కరోనా కుసుల సంఖ్య కొంత మేర తగ్గడంతో రాజధాని నుంచి ఇతర జిల్లాలకు బస్సు సర్వీసులను గతంలో ప్రారంభించింది. కానీ నగరంలో కరోనా కేసులు ఎంతకీ తగ్గకపోవడంతో నగరంలో బస్సులను నడిపించడంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేపోయింది. అయితే ప్రస్తుతం కాస్త కేసులు తగ్గుముఖం పట్టడంతో గ్రేటర్‌లో ఆర్టీసీ సర్వీసులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ప్రగతి భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన భేటీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సేవలను ప్రజలకు అందించాలని, బస్సులను రోడ్డు ఎక్కించాలని సీఎంకు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

దీంతో రేపట్నుంచి నగరంలో సిటీ బస్సులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బుధవారం నుంచి నగర శివార్లలోని బస్సులను ఇతర ప్రాంతాలకు పాక్షికంగా తిప్పుతున్నప్పటికీ శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ వర్గాల ద్వారా తెలిసింది. అంతే కాదు బస్సులో ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. సాధారణంగా అయితే సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రేటర్‌లో 3798 ఆర్టీసీ బస్సులుండగా గతేడాది సమ్మె కారణంగా ప్రభుత్వం కొన్ని బస్సు సర్వీసులను పక్కనబెట్టింది. ఈ పరిమిత సంఖ్యలోనే ప్రస్తుతం బస్సులను నడిపిస్తుంది.

Tags:    

Similar News