Weather Report: తెలంగాణలో సుర్రుమంటున్న సూరీడు

Weather Report: రెండు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉందంటున్న వాతావరణశాఖ

Update: 2024-05-01 07:58 GMT

Weather Report: తెలంగాణలో సుర్రుమంటున్న సూరీడు

Weather Report: తెలంగాణలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. నిన్న ఎండ తీవ్రత తారస్థాయికి చేరడంతో జగిత్యాల, నల్గొండ, కరీంనగర్‌లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా రాయిల్‌ మండలం అల్లీపూర్‌లో 46.1, బీర్పూర్‌ మండలం కొల్వాయిలో 46, కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు, వీణవంక మండల కేంద్రంలో 46 డిగ్రీల ఎండ కాసింది. తెలంగాణలో ఈ ఏడాదికి ఇదే అత్యధికం కాగా...ఎప్రిల్‌ 30వ తేదీ పదేళ్ల కాలంలో గరిష్ఠంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలోని మరో 14 మండలాల్లో 45.5 డిగ్రీల నుంచి 45.9 డిగ్రీల మధ్య ఉన్నాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, దామరచెర్ల, త్రిపురారం మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలో ఇవాళ, రేపు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. వడదెబ్బతో నిన్న ఒకరోజే ఐదుగురు మృతి చెందారు.

ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ర్టాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. రానున్న రెండు మూడు రోజుల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. సాధ్యమైనంత వరకు ఇంటి వద్దే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, సిక్కిం రాష్ర్టాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

Tags:    

Similar News