మహేష్ కుమార్ గౌడ్ నా మిత్రుడు.. పీసీసీ మార్పుపై వస్తున్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ!
Komatireddy Venkat Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు.
మహేష్ కుమార్ గౌడ్ నా మిత్రుడు.. పీసీసీ మార్పుపై వస్తున్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ!
Komatireddy Venkat Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌పై తాను ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదని, కొందరు ఉద్దేశపూర్వకంగానే తన మాటలను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన ఈ వివరణ ఇచ్చారు.
స్థానిక ఎన్నికల్లో ఘన విజయం:
మహేష్ కుమార్ గౌడ్ సారధ్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించిందని మంత్రి కొనియాడారు. "మహేష్ కుమార్ గౌడ్ నాకు ఎన్.ఎస్.యు.ఐ (NSUI) రోజుల నుండి మంచి స్నేహితుడు. ఆయన నాయకత్వంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడున్న పీసీసీని తొలగించాలనే ఆలోచన గానీ, ఉద్దేశం గానీ నాకు లేదు" అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
జగ్గారెడ్డి వ్యాఖ్యలపై వివరణ:
సంగారెడ్డిలో జరిగిన రంజాన్ వేడుకల్లో జగ్గారెడ్డి ఆర్గనైజింగ్ స్కిల్స్ చూసి ముగ్ధుడనయ్యానని, ఆ సందర్భంలోనే భవిష్యత్తులో జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయితే బాగుంటుందని అన్నానని ఆయన వివరించారు. అది కేవలం ఒక ప్రశంస మాత్రమేనని, ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడిని తక్కువ చేయడం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు సృష్టించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని, అటువంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని మంత్రి శ్రేణులకు సూచించారు.