వానలే వానలు

Update: 2019-08-03 02:52 GMT

తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. సింగరేణి ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గుబ్బలమంగి వాగు పొంగడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాల సీతమ్మ నారచీరల ప్రాంతం నీటిమయం అయింది. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 49,185 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. వాగులు వంకలు పొంగడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల మండల పరిధిలోని కిన్నెరసాని, మల్లన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ వర్షాలతో ఇల్లందు బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం పరిధిలో చెరువులు, వాగుల్లో జలకళ సంతరించుకుంది. సింగరేణి ఓపెన్‌కాస్టు క్వారీల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సుమారు 10వేల టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది.

అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గంగారం, కొత్తగూడ, కేసముద్రం, తొర్రూరు, పెద్ద వంగర మండలాల్లో భారీ వర్షం కురుస్తుండగా మిగతా 11 మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో పాకాల, వట్టివాగు, మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పాకాల వాగు ప్రవాహంతో గార్ల నుండి మద్దివంచ, రాంపురం, కొత్త తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం చెరువు నీటితో కళకళలాడుతోంది. ఓటాయి చెరువు, గౌరారం చెరువులు అలుగులు పోస్తున్నాయి.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లో లెవల్ కాజ్‌ వే పై నుంచి వాగునీరు పొంగిపొర్లుతోంది. పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు నీటి మునిగాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పసర నుంచి నార్లాపూర్ మీదుగా మేడారానికి రాకపోకలు నిలిచిపోయాయి. 

Tags:    

Similar News