Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

Karimnagar: జలమయమైన కరీంనగర్ *లోతట్టు ప్రాంతాలు జలమయం *సిరిసిల్లను ముంచెత్తిన వరద

Update: 2021-09-08 05:43 GMT

కరీంనగర్ లో భారీ వర్షాలు (ఫోటో ది హన్స్ ఇండియా )

Karimnagar: భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలం అయింది. రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో జనజీవనం అస్తవ్యవస్తమయింది. లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు వరద ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలకు రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలు, పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా వేలాది ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. కరీంనగర్, సిరిసిల్ల, జమ్మికుంట పట్టణాలు పూర్తిగా జలమయమయ్యాయి. వేములవాడ మూలవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి రెండోసారి వరద ప్రవాహం దాటికి కూలిపోయింది.

జిల్లాలో రికార్డ్ స్థాయిలో 31 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో కరీంనగర్, కొత్తపల్లి, హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలలో రెడ్ అలర్ట్, జిల్లాను ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాలకు భారీగా వరదనీరు పోటెత్తడంతో మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి, పార్వతి బ్యారేజీల గేట్లను ఎత్తి నీటిని దిగువ గోదావరి, మానేరు నదులకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతై మృతి చెందగా మరో ముగ్గురిని సహాయక బృందాలు కాపాడాయి.జమ్మికుంట, వేములవాడ, ఇల్లందుకుంట మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల కారణంగా చొప్పదండి మండలం రాగంపేట్ శివారులోని పందివాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు కల్వర్టుపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆర్నకొండ నుంచి రాగంపేట్, రేవెల్లి, పెద్దకుర్మపల్లి, గోపాలరావుపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాలకు చేరుకుని వరద సహాయక చర్యలు ప్రారంభించారు.

Tags:    

Similar News