తెలంగాణలోని 9 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం..

Heavy Rain: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2022-07-09 02:48 GMT

తెలంగాణలోని 9 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం..

Heavy Rain: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. వాతావరణ శాఖ 9 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉంది.

గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఆవర్తనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర ప్రాంత తీరాలకు ఆనుకొని ఉన్న వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో ఇరవైకిపైగా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌-ఎస్‌లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సుమారు 56 చెరువులు అలుగు పోస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాల్లో నీటి ప్రవాహం పెరిగింది. మహబూబాబాద్‌ జిల్లా ఏటూరునాగారం సమీపంలోని జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

హైదరాబాద్ లోనూ కుండపోత వాన కురుస్తోంది. నిన్న సాయంత్రం వరకు చిరు జల్లులతో సరిపెట్టిన వరుణుడు రాత్రి నుంచి విరుచుకుపడ్డాడు. హబ్సిగూడ, రామంతాపూర్‌లో ప్రధాన రహదారులు, కాలనీలు నీట మునిగాయి. నాగోల్‌, బైరామల్‌గూడ, సంతోష్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, కొత్తగూడ, జూపార్కు నుంచి ఆరాంఘర్‌ చౌరస్తా వెళ్లే రోడ్డు మార్గాల్లో ఫ్లైఓవర్ దగ్గర నీరు నిలిచి చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 

Full View


Tags:    

Similar News