TG: టెన్త్‎క్లాస్ స్టూడెంట్స్‎కు గుడ్ న్యూస్.. సాయంత్రం స్నాక్స్ అందజేత

Update: 2025-01-30 03:21 GMT

TG: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతూ ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం సాయంత్రం పూట స్నాక్స్ అందించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దసరా తర్వాత చాలా ప్రాంతాల్లో ఇవి మొదలయ్యాయి.

మధ్యాహ్నం 1 గంటకు భోజనం తింటే..ప్రత్యేక తరగతులు పూర్తయి ఇళ్లకు చేరేసరికి ఇతర గ్రామాల విద్యార్థులకు రాత్రి 7 గంటలు అవుతోంది. అప్పటి వరకు ఏమీ తినకపోవడంతో ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కలెక్టర్ల నిర్ణయం మేరకు కొన్ని జిల్లాల్లో సాయంత్రం స్నాక్స్ అందించేవారు. 2023లోనూ విద్యాశాఖే సమగ్ర శిక్ష ద్వారా 34రోజుల పాటు వాటిని అందించే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అమలు కాలేదు. ఈసారి మార్చి 21వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నందున ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్య పాఠశాలలు నడిచే 38 రోజులపాటు బ్రేక్ ఫాస్ట్ ఇవ్వనున్నారు.

స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రూ. 15 చొప్పున మంజూరు చేయనున్నారు. రాష్ట్రంలో దాదాపు 4500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 194 మోడల్ పాఠశాలలు సుమారు 1.90లక్షల మంది 10వ తరగతి చదువుతున్నారు. 38 రోజులకు సుమారు రూ. 11కోట్ల బడ్జెట్ అవసరం. ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు బెల్లం, చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడి, ఉడకబెట్టిన శనగల్లో రోజుకో రకం ఇవ్వనున్నారు. 

Tags:    

Similar News