బాజిరెడ్డికి త్వరలో తీపి కబురు.. నాడు వద్దన్న పదవే..ఇప్పుడు ఓకే?

Update: 2019-12-12 06:29 GMT
బాజిరెడ్డి

ఆ నేత సీనియారిటీని గుర్తించిన అధిష్ఠానం, ఆ పదవి ఆయనకు ఎప్పుడో ఖరారు చేసింది. ఐతే ఆయన మాత్రం నామినేటెడ్ పదవి చేపట్టేందుకు నసేమిరా అన్నారు. ఆలస్యమైనా మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ఓ మెట్టు దిగి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఇచ్చినా పర్లేదు, సర్దుకుపోతానన్నారు. ఐతే ఆ పదవి ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితునికి కట్టబెట్టడంతో, సదరు నేత ఒకింత నిరుత్సాహపడ్డారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పదవికి ఓకే చెప్పారట. ఆ సీనియర్ ఎమ్మెల్యేకు ఖరారైన ఆ కార్పొరేషన్ పదవి ఏంటి..? ఒకప్పుడు నచ్చని ఆ పదవే, ఇప్పుడెలా నచ్చింది...? ఆ పదవికి వారసునికి వున్న లింకేటి?

నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లో సీనియర్ ఎమ్మెల్యేగా, తిరుగులేని నేతగా ఎదిగిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి, సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి చేజారింది. ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తామంటూ అప్పట్లో అధిష్ఠానం ఆయన్ను బుజ్జగించింది. ఆర్టీసీ ఛైర్మన్ పదవి తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు. ఐతే అప్పట్లో సంస్ధ తీవ్ర నష్టాల్లో ఉండటం, కార్మికులు సమ్మెకు దిగుతారనే సమాచారం మేరకు ఆయన ఆర్టీసీ ఛైర్మన్ పదవిపై విముఖత చూపారు. తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్ధ, ఖనిజాభివృద్ది సంస్ధ, రైతు సమన్వయ సమితి పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని తన మసస్సులో మాట అధిష్ఠానం చెవిన వేశారట బాజిరెడ్డి. వివిధ కారణాల దృష్ట్యా ఆ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేశారట కేసీఆర్.

తాజాగా టీఆర్ఎస్ అధిష్ఠానం నామినేటెడ్ పదవులపై కసరత్తు చేస్తున్నట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఆర్టీసీ ఛైర్మన్ పదవిని బాజిరెడ్డికి దాదాపగా ఖరారు చేశారని టాక్ నడుస్తోంది. ఐతే గతంలో ఆర్టీసీ ఛైర్మన్ పదవి వద్దన్న బాజిరెడ్డి ఇప్పుడు ఆ పదవి స్వీకరిస్తారా లేదా అన్నది ఆయన వర్గీయుల్లో చర్చగా మారింది. ఐతే సీఎం కేసీఆర్ ప్రకటించిన వరాల జల్లుతో ఆర్టీసీ గాడిలో పడుతుందన్న భావనలో ఉన్న బాజిరెడ్డి ,ఛైర్మన్ పోస్టు తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు.

టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలోనూ ఆర్టీసీ ఛైర్మన్ పదవి కోసం బాజిరెడ్డి పేరును పరిశీలించారట. అప్పట్లో ఆయన మంత్రి పదవి కోసం పట్టుబట్టడంతో ఆ ఛాన్స్ మిస్సయ్యిందట. గులాబీ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చాక, మంత్రి పదవి దాదాపుగా ఖాయం అనుకున్న సమయంలో, సామాజిక సమీకరణాలు ఆయనకు శాపంగా మారాయట. ఆయన కంటే జూనియరైన ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో బాజిరెడ్డి నొచ్చుకున్నారు. అదే సమయంలో మరోసారి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇస్తానంటూ అధిష్ఠానం ఆఫర్ ఇచ్చిందట. ఐతే ప్రశాంత్ రెడ్డి మొన్నటి వరకు ఆర్టీసీ మంత్రిగా ఉండటంతో, చైర్మన్ పదవి తీసుకుంటే మంత్రి ప్రశాంత్ రెడ్డి కింద పనిచేయాల్సి వస్తుందనుకొని ససేమిరా అన్నారట. ఐతే ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ బాధ్యతల్లో ఉండటంతో ఇప్పుడు ఓకే చెప్పేశారట బాజిరెడ్డి.

నాడు వద్దన్న ఆర్టీసీ ఛైర్మన్ పదవి నేడు ఓకే చెప్పడానికి మరో కారణం కూడా లేకపోలేదనే టాక్ ఇందూరు పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు బాజిరెడ్డి జగన్‌కు ఎమ్మె్ల్యే టికెట్టు కోసం పట్టుబట్టారట. హామి రావడంతో ఆయన కార్పొరేషన్ పదవి తీసుకునేందుకు ఒప్పుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి కొన్ని గంటల్లో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మాస్ లీడర్‌గా పేరున్న బాజిరెడ్డికి, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి వరిస్తుండటంతో ఆయన వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆయన మాత్రం కొంచె ఇష్టంగా మరికొంచెం కష్టంగా ఉన్నారట. అనుకుంన్నదొక్కటి, అవుతున్నదొక్కటి అంటూ తెగ బాధ పడిపోతున్నారట. చూద్దాం ఏం జరగబోతుందో అని ఆయన అనుచరులు జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారట.  

Full View

Tags:    

Similar News